ఏపీలోని ప్రైవేట్ స్కూల్స్..కాలేజీలు తమ విద్యార్దులకు క్రీడా సౌకర్యాలు దక్కాలంటే ‘ప్రైవేట్’గా డబ్బులు కట్టాల్సిందేనా?. ఏ జిల్లాలో లేని ఈ ‘ప్రైవేట్ వసూళ్లు’ ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎందుకు చేస్తున్నట్లు?. అది కూడా కొందరు మాత్రమే ఎందుకు?. ఇలా వసూలు చేసిన నిధులను నిజంగా క్రీడా సౌకర్యాల అభివృద్ధి, మెరుగుదలకు వాడుతున్నారా? లేక కీలక స్థానాల్లో ఉన్న వారు తమ సొంతానికి వాడేసుకుంటున్నారా?. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో పాటు సాక్ష్యాత్తూ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఓ జిల్లా కలెక్టర్ ఏకంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల దగ్గర నుంచి నెల వారీ వసూళ్లు చేయవచ్చా?. అది నిరంతర ప్రక్రియా?. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల దగ్గర డబ్బులు వసూలు చేసి క్రీడా సౌకర్యాలు అభివృద్ది చేస్తారా?. మరి ప్రభుత్వ బాధ్యత ఏంటి?. ప్రభుత్వం అందరికీ ఉచితంగా క్రీడా సౌకర్యాలు కల్పించాల్సింది పోయి...ప్రైవేట్ స్కూల్స్ నుంచి నెలవారీ డబ్బులు వసూలుచేయటం ఏమిటి?. ఇవి ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి?.
క్రీడా సౌకర్యాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని కాలేజీలు, స్కూల్స్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. విషయం బయటకు చెపితే మాత్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల దగ్గర నెల నెలా డబ్బులు వసూలు చేసుకునేలా 2015 నవంబర్ 4న అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఈ వసూళ్ల ప్రక్రియ సాగుతోందని..ఈ మొత్తం వాస్తవానికి జిల్లా క్రీడా అధికారులకు చెల్లించాలని ఆదేశించినా..అవి వసూళ్ళలో జిల్లాలోనే ‘కింగ్’గా మారిన వ్యక్తి చేతికి వెళుతున్నాయని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఎవరి దగ్గర నెలకు ఎంత వసూలు చేయాలన్నది కూడా ఈ మెమోలో స్పష్టం చేశారు. ప్రైమరీ స్కూల్స్ అయితే నెలకు 2500 లెక్కన 12 నెలలకు గాను 30 వేల రూపాయలు చెల్లించాలి.
ఒకటి నుంచి పదవ తరగతి వరకూ పాఠశాలలు అయితే నెలకు 5 వేల లెక్కన 12 నెలలకు గాను ఏటా 60 వేల రూపాయలు కట్టాల్సిందే. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు అయితే నెలకు 5 వేల రూపాయల లెక్కన 12 నెలలకు గాను 90 వేల రూపాయలు కట్టాలి. ఒక్కో నియోజకర్గంలో ఇలా ఎన్ని స్కూల్స్, కాలేజీలు ఉంటాయో లెక్కేసుకోండి. కోట్లాది రూపాయల ఈ పేరుతో వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ వైపు అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అనుమతితోనే ఈ దందా సాగుతుందా?. ముఖ్యమంత్రి, మంత్రి విలాసాలకు కోట్లాది రూపాయలు వెచ్చించే ఏపీ సర్కారు నియోజకవర్గాల్లో క్రీడా మౌలికసదుపాయాల కల్పనకు నిధులు కేటాయించలేదా?.