జూనియర్ డాక్టర్ ఆత్మహత్య

Update: 2018-08-07 06:24 GMT

చిత్తూరు జిల్లాలో కలకలం. ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్ద దుమారం రేపుతోంది. కొద్ది కాలం క్రితం ఆమె వేధింపులకు సైతం గురైంది. ఈ విషయంపై ఫిర్యాదులు కూడా చేసింది. అయినా చర్యలు శూన్యం. ఈ తరుణంలో శిల్ప అనే జూనియర్ ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదేళ్ల క్రితం రూపేశ్‌ కుమార్‌ అనే వ్యక్తితో శిల్పకు ప్రేమ వివాహం జరిగింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలోని పీడీయాట్రిక్‌ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్‌.

తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్‌ నెలలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసిందని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్‌ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్‌ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు శిల్ప మృతికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

 

 

 

 

 

 

Similar News