చంద్రబాబు నిలబడతారా... భయపడతారా?!

Update: 2018-08-23 04:50 GMT

తెలుగుదేశం, కాంగ్రెస్ ల పొత్తు ఖరారు దిశగానే పరిణామాలు ముందుకు సాగుతున్నాయి. అయితే అంతా సవ్యంగా జరిగి..తెలంగాణలో ఈ రెండు పార్టీలు కలిస్తే అధికార టీఆర్ఎస్ కు గడ్డుకాలమే. అయితే కాంగ్రెస్, టీడీపీల పొత్తు కుదిరినా కూడా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా బరిలోకి దిగి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తేనే ఫలితం ఉంటుందని..అలా కాకుండా పొత్తు పెట్టుకుని వదిలేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదనేది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలు బహిరంగ సభలు పెట్టి చంద్రబాబు పాల్గొంటే ఇక అసలు టీఆర్ఎస్ పని పోయినట్లేనని కాంగ్రెస్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ తో పొత్తు చంద్రబాబుకు అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఇది చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు ‘పరాకాష్ట’గా మిగులుతుంది. ఇప్పుడు మోడీపై వ్యతిరేకత ముఖ్యం అంటున్న చంద్రబాబు...గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పై ఇలాగే మాట్లాడారు. దాని కంటే ముందు టీడీపీ మూలాలు కాంగ్రెస్ కు వ్యతిరేకం.

ఇవన్నీ కూడా అంత తేలిగ్గా తీసిపారేసే అంశాలు కాదు. అయితే ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పటి నుంచి చంద్రబాబు ఎప్పుడూ నేరుగా కెసీఆర్ పై ఒక్కటంటే ఒక్కసారి విమర్శలు చేసిన సందర్భం లేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా పలెత్తి మాట అనకుండా వెళ్లిపోయారు. పార్టీ మీటింగ్ ల్లోనూ కెసీఆర్ పై కానీ..టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. ఓ వైపు ఆయనపై ఓటుకు నోటు కేసు అలా పెండింగ్ లో ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు ధైర్యం చేసి కెసీఆర్ ను ఎదుర్కొనే సత్తా చూపిస్తారా? లేక గతంలో మాదిరిగా ఏదో సో సో గా ప్రచారం చేస్తారా?. తెలంగాణలో టీడీపీ తన ఉనికి చాటుకోవటానికి కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకం. తెలంగాణలో పార్టీ ఈ స్థితికి చేరటానికి చంద్రబాబునాయుడే కారణం అని టీ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. చంద్రబాబు ధైర్యం చేసి కెసీఆర్ ను ఢీకొడతారా? లేక భయపడతారా? అన్నది తేలాల్సి ఉంది.

 

 

 

Similar News