అంటే అవుననే అంటున్నాయి ఏపీలోని ఉన్నతస్థాయి వర్గాలు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కారు కొలువుదీరిన తర్వాత వచ్చిన ముఖ్యమైన ప్రాజెక్టు ‘హీరో మోటో కార్ప్’ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్. అగ్రగామి ఈ ద్విచక్ర వాహన సంస్థ ఏపీకి రావటంతో అందరూ సంతోషించారు. హీరో మోటోకార్ప్ లిమిటెడ్ 2014 సెప్టెంబర్ 16న సర్కారుతో అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుంది. ఈ సంస్థకు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సమీపంలో కారుచౌకగా ఆరు వందల ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమి కోర్టు వివాదాల్లో ఉండటంతో ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. అయితే ఏపీ సర్కారు కంపెనీ పెట్టిన కండిషన్లు అన్నీ ఒప్పుకుని..ఈ భూమిపై కోట్లాది రూపాయలు వెచ్చించింది. అయితే ఈ ఏడాది మార్చి23న ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హీరో మోటోకార్ప్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ పై కంపెనీ 1600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సుమారు 12 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఆరు వందల ఎకరాల భూమిని కూడా సేల్ డీడ్ కింద కంపెనీకి అప్పగించేశారు. అయితే భవిష్యత్ లో ఏమైనా ఇబ్బంది వస్తే జరిగే నష్టం మొత్తం సర్కారే భరిస్తుందని ఏకంగా జీవో జారీ చేశారు. దీనిపై ప్రభుత్వ శాఖలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా సర్కారే ముందుకే వెళ్లింది.
అయితే శంకుస్థాపన జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకూ హీరో మోటోకార్ప్ యూనిట్ లో పనులు ప్రారంభం కాలేదని..దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భూమిని కారుచౌకగా ఇవ్వటంతో పాటు..ఈ సంస్థకు పలు రాయితీలు ఇఛ్చినందున తమ వాటా ఎంతో తేల్చాల్సిందిగా ప్రభుత్వంలోని పెద్దలు పట్టుపట్టినట్లు సమాచారం. ఇది తేలకపోవటంతోనే హీరో మోటో కార్ప్ పనులు ముందుకు సాగటంలేదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. తమకు నచ్చిన సంస్థలకు భారీ ఎత్తున రాయితీ రేట్లతో భూములు ఇఛ్చి..అడ్డగోలు రాయితీలు ఇఛ్చి వారి దగ్గర నుంచి మళ్ళీ క్విడ్ ప్రోకో కింద ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. హీరో మోటోకార్ప్ లాంటి సంస్థకు కూడా ఈ పరిస్థితి తలెత్తటం విశేషం. ఓ వైపు పారిశ్రామికవేత్తలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటూ మరో వైపు ‘వాటాల’ పంచాయతీని తెరపైకి తెస్తున్నారు. గతంలో ఇలా జరిగిందని విమర్శలు చేసిన వారే..ఇప్పుడు అదే పనిని రిపీట్ చేస్తున్నారు. ప్రభుత్వంలో పెచ్చుమీరిన అవినీతే ఈ స్థితికి కారణం అని చెబుతున్నారు.