తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తుకు లైన్ క్లియర్ అయింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన సీఎం కెసీఆర్ తాము ఒంటరిగా బరిలో ఉంటామని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తుకు మార్గం సుగమం అయినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కెసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అందరినీ తమ వైపు తిప్పుకున్నారు. టీఆర్ఎస్ వెళ్ళగా మిగిలిన లీడర్లు వివిధ పార్టీల వైపు వెళ్ళిపోయారు. అయినా కూడా తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా పది నుంచి పదిహేను శాతంపైనే ఉంటుందని అంచనా. తొలుత టీడీపీ, టీఆర్ఎస్ పొత్తుకు కొంత మంది ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవేమీ ఫలించినట్లు లేదు. మారిన పరిస్థితుల్లో టీఆర్ఎస్, టీడీపీల పొత్తు జరిగే పనికాదని తేలిపోయింది. తాజాగా తెలంగాణ సీఎం కెసీఆర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీకి దగ్గర అవటం, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిన్నటి మొన్నటివరకూ అనుకూలంగా మాట్లాడి..ఇప్పుడు రివర్స్ గేర్ వేసిన టీఆర్ఎస్ అంటే టీడీపీ శ్రేణులు కూడా అసంతృప్తితో ఉన్నాయి.
కెసీఆర్ తాజా ప్రకటన..తాజా పరిణామాలు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తుకు లైన్ క్లియర్ అయినట్లేనని..రెండు పార్టీలకు అంతకు మించిన మరో ఆప్షన్ కూడా లేదని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎలాంటి వివాదాలు లేకుండా ఖరారు అయితే మాత్రం అది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపర్చటం ఖాయం అని చెబుతున్నారు. ఏపీలో ఒంటరి అయిపోయిన చంద్రబాబు తెలంగాణతో పాటు ఏపీలోనూ కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు రెడీ అయిపోయారు. అయితే కెసీఆర్ తాజా వ్యాఖ్యలు ఈ పొత్తు స్కోప్ ను మరింత పెంచాయి. తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశఫెట్టినప్పటికీ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యవహారశైలి వల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. చాలా చోట్ల అధికార పార్టరీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు.