‘హక్కు’ను వదులుకుని అప్పుల కోసం ఆరాటం!

Update: 2018-08-16 03:03 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి కేంద్రం నుంచి నిధులు పొందటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హక్కు. కానీ ఇప్పుడు సర్కారు ఆ హక్కును వదిలేసి..నిత్యం ‘అప్పుల కోసం’ ఆరాటపడుతోంది. ఏపీకి ఢిల్లీ స్థాయి రాజధాని అనే నరేంద్రమోడీ హామీ..ఓ రాజకీయ ప్రకటన. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలన్నది విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న అంశం. రాజధానికి చెందిన కీలక భవనాలతో పాటు...మౌలికసదుపాయాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రధాని ఢిల్లీ స్థాయి రాజధాని అన్నారనే విమర్శలు తప్ప..అసలు కేంద్రం రాజధాని భవనాలు..మౌలికసదుపాయాలకు కలిపి ఎంత ఇస్తుంది? అది ఏ ప్రాతిపదికన ఇస్తారు వంటి అంశాలపై ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర సర్కారు కోర్టుకు కూడా వెళ్ళొచ్చని చెబుతున్నారు. ప్రత్యేక హోదాలాగా ఇది హామీ కాదని..రాజధానికి నిధులివ్వాలనే అంశం స్పష్టంగా పేర్కొన్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అయితే సర్కారు ఈ దిశగా చర్యల కంటే అప్పుల రూపంలో నిధులు తెచ్చి..స్వలాభం చూసుకోవటంతోపాటు రాజధాని పనులు పూర్తి చేయాలనే యోచనలో ఉందని చెబుతున్నారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులు అయితే వాటికి పక్కాగా లెక్కలు చెప్పాల్సి ఉంటుందని..అదే రాష్ట్ర అప్పులు అయితే మాత్రం ఎలా ఖర్చు పెట్టుకున్నా పెద్దగా అభ్యంతరాలు ఉండవనేది వీరి వాదన. అందుకే బాండ్ మార్కెట్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా 10.38 శాతం వడ్డీ రేటుకు బాండ్లు జారీ చేసి..రెండు వేల కోట్ల రూపాయలు సమీకరించిన సర్కారు...రాబోయే రోజుల్లోనూ ఇదే స్పీడ్ గా అప్పులు చేసేందుకు రెడీ అవుతోంది. సహజంగా అధిక వడ్డీ రేటు ప్రతికూల పరిస్థితి ఉండే బాండ్లకే ఉంటుందని..కానీ ఇంత ఎక్కువ వడ్డీ రేటుతో బాండ్లు జారీ చేసి అది ఓ సూపర్ సక్సెస్ అని ప్రచారం చేసుకోవటంపై అధికార వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. బాండ్లు సూపర్ సక్సెస్ అని..ఇది చంద్రబాబు ఇమేజ్ కు చిహ్నం అని పేర్కొనటంపై కూడా ఓ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి గ్యారంటీ లేకుండా బాండ్లను కొనుగోలు చేస్తే అలాగే అనుకోవచ్చని..కానీ ఆ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వమే పూచీకత్తు ఉందని..పూచీకత్తు ఉన్న బాండ్లను..అదీ అత్యధిక వడ్డీ రేట్లతో కూడిన వాటిని ఎవరైనా కొనుగోలు చేస్తారని వ్యాఖ్యానించారు.

 

Similar News