‘ఓ స్లమ్ కట్టించాలంటే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేశీయ నిర్మాణ కంపెనీలు మురికివాడలు మాత్రమే కట్టగలవు. నేను ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాల్సి ఉంది. మురికివాడలు కాదు. ’ ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొంత కాలం క్రితం నూతన రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు. సింగపూర్..ఆస్తానా, జపాన్, చైనా వంటి దేశాలు తిరిగేది రాజధాని నిర్మాణాలకు విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకే అని ఏపీ ప్రజలను నమ్మించారు చంద్రబాబు. అంతే కాదు..సింగపూర్ కంపెనీలే రాజధాని నిర్మిస్తున్నాయని..తన అనుభవం, తన క్రెడిబులిటీ చూసే అవి ముందుకొచ్చాయని అందరినీ నమ్మించారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే రాజధాని నిర్మాణంలో ఒక్కటంటే ఒక్క విదేశీ కంపెనీ కూడా పాల్గొనటం లేదు. అమరావతిలో కొత్తగా కట్టనున్న సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు అన్నీ దేశీయ కంపెనీలకే దక్కనున్నాయి. అందులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఉంది. మరి దేశీయ కంపెనీలు కేవలం మురికివాడలు మాత్రమే కడతాయని ప్రకటించిన చంద్రబాబు ఈ సంస్థలకు అత్యంత కీలకమైన..ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన రాజధాని పనులు ఎందుకు అప్పగిస్తున్నట్లు?.
చంద్రబాబు ఇమేజ్..క్రెడిబులిటీ చూసి ఏపీ రాజధాని నిర్మాణానికి ఏ విదేశీ సంస్థ ఎందుకు ముందుకు రాలేదు?. అమరావతిలో శాశ్వత రాజధానికి సంబంధించిన కొత్త నిర్మాణాలు అన్నింటిని కూడా కొంచెం అటు ఇటుగా ఐదు శాతం ఎక్సెస్ రేట్లతో అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే ఈ కాంట్రాక్ట్ లు కూడా అంతా ఓ పథకం ప్రకారం అప్పగిస్తున్నట్లే కన్పిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం అంటూ దేశాల మీద దేశాలు తిరిగిన చంద్రబాబు ఎందుకు దేశీయ కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు?. అమరావతి పేరుతో ఓట్లు వేసి గెలిపించిన సొంత ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?. దేశీయ కంపెనీలు కేవలం మురికివాడలు మాత్రమే కట్టగలవని బహిరంగంగా వ్యాఖ్యానించి..ఇఫ్పుడు మరి దేశీయ కంపెనీలకు రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించటం వెనక మతలబు ఏమిటి?. చంద్రబాబును నమ్మి...ఆయన విశ్వసనీయత చూసి ఉదారంగా ఏపీకి సాయం చేసేందుకు వచ్చిన సింగపూర్ కంపెనీలు ఎందుకు రాజధాని నిర్మాణంలో పాల్గొనటంలేదు. మరి సింగపూర్ కంపెనీలు కట్టేది ఇదే అంటూ చూపించిన ‘అందమైన డిజైన్లు’ అన్నీ అబద్దాలేనా?. చంద్రబాబు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?.