ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ..కేంద్రంలో ఉన్న బిజెపిలు ‘స్కామ్ లాట’ ఆడుతున్నాయి. ఏపీలో పీడీ అకౌంట్స్ తో 2జీని మించిన కుంభకోణం జరిగిందని బిజెపి ఎంపీ జీవీ ఎల్ నరసింహరావు సంలచన ఆరోపణలు చేస్తుంటే...అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు పనికి ఆహార పథకంలో భారీస్కామ్ జరిగిందని..ఆధారాలతో సహా గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఆయన చర్యలు తీసుకోవటంలేదని మండిపడుతున్నారు. బిజెపి నేతలు ఏపీలో స్కామ్ ల లిస్ట్ అలా చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. మా స్కామ్ కు మీ స్కామ్ తో చెల్లు అన్న చందంగా ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా కేంద్రాన్ని షేక్ చేస్తాం..మోడీ సర్కారును పడగొడతాం అని పెద్ద ప్రకటనే చేశారు. ఎస్సార్ ఆయిల్ కంపెనీ అమ్మకంలో మనీ లాండరింగ్ జరిగిందని..దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తారు. కానీ అదే ఏపీ విషయానికి వచ్చేసరికి బిజెపి నేతలు అడిగే శ్వేతపత్రం కాదు..కదా ఏమీ ఇవ్వటానికి..కనీసం సమాచారం ఇవ్వటానికి కూడా ఆసక్తిచూపటం లేదు. నిజంగా కేంద్రంలో మోడీ సర్కారు కుంభకోణాలు చేసి ఉంటే కుటుంబరావు చెప్పిన లాజిక్ ప్రకారం ఆయన..లేదంటే ఆయన పార్టీనే ఎందుకు కోర్టులను ఆశ్రయించటం లేదు?. అన్నది ఎవరికైనా వచ్చే అనుమానమే. ఏపీ ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా సరే మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లండి అని సవాల్ విసురుతున్నారు.
అదే పని మరి కుటుంబ రావు ఎందుకు చేయరు?. కేంద్రాన్ని షేక్ చేసే స్కామ్ లు బయటపెడతానని టీజర్లు ఇచ్చిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన విమర్శలను బిజెపి అయితే చాలా లైట్ గా తీసుకుంది. అదే బిజెపి చేసే విమర్శలపై కుటుంబరావు వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. అటు కుటుంబరావు, ఇటు జీవీఎల్ నరసింహరావులు పరస్పరం చేసుకునే వ్యాఖ్యలు రాజకీయాల పరువును మరింత దిగజారుస్తున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పుడే వ్యక్తిగత విమర్శల స్థాయి ఇలా ఉంటే...ఎన్నికల నాటికి ఇది ఎన్ని మలుపుల తిరుగుతుందో అన్న పరిస్థితి ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఏపీ సర్కారు అవినీతిని వదిలిపెట్టే ప్రశ్నేలేదని చెబుతున్న బిజెపి నేతలు..ఆచరణ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నోరు తెరవటం లేదు.