ఒక్క కంపెనీ. ఒకే ఒక్క కంపెనీ. మాకు మెటీరియల్ తెచ్చుకోవటం కష్టం ఉంది. అడ్వాన్స్ లు కూడా భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు ఉన్న పది శాతం కాకుండా మెటీరియల్ కోసం అదనంగా ఐదు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని అడిగింది. అడిగింది ఒక్కటే కంపెనీ. కానీ అందరికీ వర్తింపచేశారు. భవిష్యత్ లో చేసే వారికి కూడా వర్తిస్తుందని తేల్చిచెప్పారు. పని చేయటానికి మెటీరియల్ అవసరం ఉంటుందని పేరుగాంచిన ఆ కాంట్రాక్ట్ సంస్థకు తెలియదా?. పోనీ టెండర్లు దాఖలు చేసే సమయంలో మెటీరియల్ తెచ్చుకోవాల్సి ఉంటుందని ఆ అగ్రశ్రేణి సంస్థకు తెలియదు అంటే ప్రజలు నమ్మాలా?. అప్పుడు ఓకే అని రంగంలోకి..ఇప్పుడు మెలిక పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది?. టెండర్ ఖరారు చేసే సమయంలోనే ఇంజనీర్లకు ఏది ఎంత అవసరమో..ఏ మేరకు ఇవ్వవచ్చో పేర్కొనలేదా?. రాజధాని ప్రాంతంలో ఏకంగా 38 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే..అందులో కేవలం ఒక్క కంపెనీకి మాత్రమే కష్టంగా ఉంటే...అందరికీ వర్తింపచేసేలా ఉదారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది?.
అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కమిషన్ల కోసం కాకపోతే?. ఇప్పటికే ఖరారు అయి..పనులు అప్పగించిన సంస్థలకు మధ్యలో ఇలా ఐదు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇవ్వటం నిబంధనలకు విరుద్దం అని ఆర్థిక, న్యాయ శాఖతోపాటు సీఆర్ డీఏ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎందుకు చంద్రబాబునాయుడు కేబినెట్ ముందు పెట్టి మరీ ఈ అడ్డగోలు దందాకు నిర్ణయం తీసుకున్నారు. అంటే కేవలం రాజధాని పేరుతో..అత్యవసరం పేరుతో దోపిడీ కోసమే అన్న వాదన విన్పిస్తోంది. మంత్రివర్గ నిర్ణయం కావటంతో సీఆర్ డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కూడా చేసేదేమీ లేక జీవో 267 జారీ చేశారు. దీంతో రాజదాని పేరుతో చంద్రబాబు సర్కారు దోపిడీకి మార్గం సుగమం అయింది. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారి...వచ్చిన కొత్త సర్కారు విచారణకు ఆదేశిస్తే ఈ మొత్తం ఎపిసోడ్ లో కేబినెట్ కేబినెట్ మొత్తం చిక్కుకోవటం ఖాయం అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన శాఖల లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ స్కామ్ లు అన్నింటికి కేబినెట్ ఆమోదముద్ర వేసుకుంటూ చంద్రబాబు సర్కారు యధేచ్చగా ప్రజాధనాన్ని లూటీ చేస్తోంది. నిర్మాణ సంస్థలతో కలసి సర్కారే ఈ స్కామ్ కు తెరలేపినట్లు అయింది.