మహానటి సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..అమెరికాలోనూ సత్తా చాటుతోంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. మే9న విడుదల ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో మహానటి సినిమా శుక్రవారం వరకూ 5.75 కోట్ల రూపాయలు సాధించినట్లు సమాచారం. త్వరలోనే మిలియన్ డాలర్ల క్లబ్ లో ఈ సినిమా చేరే అవకాశం కన్పిస్తోంది. పాత తరం నటి సావిత్రికి సంబంధించి ఓ బయోపిక్ కు ఇంత ఆదరణ లభిస్తుండటంతో మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం తేటతెల్లం అవుతోంది. అదే సమయంలో ఈ సంవత్సరం అమెరికాలో అత్యధిక వసూళ్ళు సాధించిన వాటిలో మహానటి ఆరవ స్థానంలో నిలిచింది.
రంగస్థలం, భరత్ అనే నేను, అజ్ణాతవాసి, భాగమతి, తొలిప్రేమ చిత్రాలు అమెరికాలో సత్తా చాటాయి. ఇప్పుడు ఆ జాబితాలో మహానటి సినిమా కూడా చేరింది. ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ అభినయానికి మాత్రం పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయి. దీంతోపాటు సమంత, దుల్కర్ సల్మాన్ లు సైతం ఈ బయోపిక్ లో మంచి నటన కనపర్చారు. ఈ సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఇమేజ్ ఒక్కసారిగా పీక్ కు వెళ్లిందని చెప్పొచ్చు.