వైసీపీ..జనసేన పొత్తు ఆశలు ఆవిరేనా?!

Update: 2018-07-26 06:12 GMT

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని దెబ్బకొట్టడానికి జనసేనతో పొత్తు పెట్టుకోవాలనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. తాజాగా పదవులు వదులుకున్న ఎంపీలు కొంత మంది కూడా ఇదే అభిప్రాయాన్ని అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేశారు. ఎన్నికల నాటికి ఇది ఖరారు అయ్యే అవకాశం ఉందని కూడా ఇటీవల వరకూ చాలా మంది భావించారు. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే మాత్రం జగన్, పవన్ లు కలవటం సాధ్యమయ్యే పనేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొంత కాలంగా పవన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ల అవినీతినే ఎక్కువగా టార్గెట్ చేశారు.అప్పుడప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే జగన్ తాజాగా పవన్ పెళ్లిళ్ళ వ్యవహారంపై మాట్లాడటం పెద్ద దుమారమే రేపింది. ఈ అంశంపై జనసేన కూడా అంతే స్థాయిలో స్పందించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇరు పార్టీల అభిమానులు వ్యక్తిగత దూషణల పర్వాన్ని పరాకాష్టకు తీసుకెళ్ళారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై గురువారం నాడు జారీ చేసిన ప్రకటన హుందాగా ఉంది.

తాజా పరిణామాలు అధికార తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆనందాన్ని నింపుతున్నాయి. ఓ వైపు పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు నిన్నమొన్నటివరకూ తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి... ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మాట్లాడటం ప్రారంభించారు. వారి అంతిమ లక్ష్యం ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరగాలి..రాజకీయంగా అది తమకు లాభించాలి. తెలుగుదేశం పార్టీ గత కొంత కాలంగా ఎన్నికల నాటికి జగన్, పవన్ కలుస్తారని..వీరిద్దరిని వెనకుండి బిజెపినే నాటకం ఆడిస్తోందనే ప్రచారం భారీ ఎత్తున బహిరంగంగానే చేస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకే...వైసీపీ శ్రేణులకు స్పష్టత ఇచ్చేందుకే పవన్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారనే ఓ వాదన కూడా పార్టీలో ఉంది. అయినా జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై మాత్రం తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా వంటి ఎన్నో కీలక అంశాలపైనే అలవోకగా మాటలు మార్చేశారని..ఈ ఒక్క అంశంతో పొత్తు ఉంటుందా?. లేదా అని నిర్ధారించలేమని ఓ వైసీపీ నేత వ్యాఖ్యానించారు.

Similar News