రాఫెల్ స్కామ్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏం సంబంధం అంటారా?. అలా అంటే మరి ఎస్సార్ అయిల్ అమ్మకానికి...చంద్రబాబుకు..టీడీపీకి కూడా ఏం సంబంధం ఉండకూడదు. చంద్రబాబు లెక్క తనకు రాజకీయ ప్రయోజనం వస్తుందని అనుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యలపై కూడా మాట్లాడతారు. ఓ సారి మాట్లాడారు కూడా. రాఫెల్ స్కామ్ ఓ వైపు మోడీ సర్కారు మెడకు గట్టిగా చుట్టుకుంటున్నా ఎందుకు ఏపీ సీఎం చంద్రబాబు అసలు దీనిపై మాటే మాట్లాడటం లేదు. అనిల్ అంబానీ తనకు సన్నిహితుడు కాబట్టి అంటున్నాయి ఏపీలోని అధికార వర్గాలు. వైసీపీతో కలవటం ద్వారా ప్రధాని మోడీ అవినీతి కుడితిలో పడ్డారని తీవ్రంగా ఆక్షేపించిన చంద్రబాబునాయుడు దేశంలో ప్రస్తుతం కలకలం రేపుతున్న ‘రాఫెల్’ స్కామ్ గురించి మాత్రం మాట మాత్రంగానైనా ప్రస్తావించటం లేదు. ఈ రాఫెల్ డీల్ పై టీడీపీ కాబోయే మిత్రపక్షం కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇది ఖచ్చితంగా స్కామే అంటూ పలు ఆధారాలు కూడా విడుదల చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ప్రధాని మోడీపై ఎలాంటి విమర్శలు చేసే ఛాన్స్ వచ్చినా ఏ మాత్రం వదులుకోవటానికి సిద్ధంగా లేని చంద్రబాబు అండ్ టీడీపీ టీమ్ రాఫెల్ స్కామ్ పై ఎందుకు మౌనంగా ఉంది?. ఈ మధ్యే ఎస్సార్ ఆయిల్ అమ్మకంలో పెద్ద స్కామ్ జరిగిందని..ఇందులో మోడీ పాత్ర ఉందని ఆరోపించిన టీడీపీ నేత కుటుంబరావు మరి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ , ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ ల మధ్య ఒప్పందం గురించి ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను వదిలేసి...ఏ మాత్రం అనుభవంలేని అనిల్ అంబానీ కంపెనీకి ఈ డీల్ కట్టబెట్టడం వెనక మతలబు ఏమిటి? అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయితే అసలు ఈ డీల్ లో స్కామే లేదని అనిల్ అంబానీ వాదిస్తున్నారు. అది వేరే విషయం. ఇంత భారీ స్కామ్ పై నీతి, నిజాయతీలకు...రాజకీయాల్లోనే ఏకైక నిప్పుగా ఉన్న చంద్రబాబు ఎందుకు నోరు తెరవటం లేదు.
మోడీపై ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేసే అవకాశం ఉన్నా ఎందుకు మౌనం దాల్చుతున్నారు.? అంటే అధికారులే కాదు..టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి అనిల్ అంబానీ, చంద్రబాబుల లొగుట్టు సంగతి. చంద్రబాబుకు మొదటి నుంచి రిలయన్స్ సంస్థలతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలు చాలా వరకూ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబునాయుడు అట్టహాసంగా అనిల్ అంబానీకి చెందిన ఓ కంపెనీతో 2016 జనవరి 11న వైజాగ్ లో జరిగిన భాగస్వామ్య సదస్సులో షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. భారీ ప్రచారం కూడా చేసుకున్నారు. ఈ సంస్థ సర్కారు నుంచి ఏకంగా మూడు వేల ఎకరాలు అడిగింది. విశాఖపట్నంకు 70 కిలోమీటర్ల దూరంలో రాంబిల్లి వద్ద ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. కానీ సర్కారు తొలి దశలో వెయ్యి ఎకరాలు ఇస్తామని ముందుకొచ్చినా..ఇప్పటి వరకూ కంపెనీ ఆ భూమి తీసుకోవటానికి..డబ్బు చెల్లించటానికి మాత్రం ముందుకు రాలేదు. పలుమార్లు ప్రభుత్వ అధికారులు కంపెనీని భూమికి సంబంధించి అడ్వాన్స్ చెల్లింపులు చేయాలని కోరినా ఇంత వరకూ స్పందించలేదు. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థ యూనిట్ ముందుకెళ్ళే ఛాన్స్ లు లేవని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాఫెల్ డీల్ పై చంద్రబాబు మాట్లాడితే ఎక్కడ తమ విషయాలు బయటకు వస్తాయో అన్న భయం ఉందని చెబుతున్నారు.