కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కొత్త చిచ్చురేపారు. తాజాగా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనపై రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ అభ్యర్ధుల ప్రకటన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు?. అంతే కాదు..అభ్యర్ధులను ప్రకటించటానికి నారా లోకేష్ ఏమీ పార్టీ అధ్యక్షుడు కాదని వ్యాఖ్యానించారు. అభ్యర్ధులను నిర్ణయించేది చంద్రబాబునాయుడే అన్నారు. కర్నూలు అసెంబ్లీ బరి నుంచి టీ జీ వెంకటేష్ తన కుమారుడిని పోటీలో నిలపాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. టీజీ ఆశలపై నీళ్ళు చల్లుతూ లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుకను..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఇది టీజీ గ్రూప్ కు మింగుపడని వ్యవహారంగా మారింది. అందుకే టీజీ ఇప్పుడు ధిక్కార స్వరం విన్పించారు. అభ్యర్దుల ప్రకటన చేసేలా లోకేష్ పై ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా హిప్నటైజ్ చేశారేమో అని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన అలా చెప్పి ఉండొచ్చని అన్నారు.
అయినా తెలుగుదేశం పార్టీలో ఇంత ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటించే సంప్రదాయం లేదన్నారు. విశేషం ఏమిటంటే ఇలా సీట్ల కోసం ఫైటింగ్ చేస్తున్న వారంతా గత కొంత కాలం క్రితం వివిధ పార్టీ ల నుంచి టీడీపీలో చేరిన వారే. అయితే టీజీ వ్యాఖ్యలపై ఎస్వీ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు పార్టీ అభ్యర్ధులను ప్రకటించే అధికారం ఉందన్నారు. ఇలా ముందుగా అభ్యర్ధులను ప్రకటించటం వల్ల చాలా మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. మరి తన తనయుడు నారా లోకేష్ పై ఈ స్థాయిలో విమర్శలు చేసిన టీజీ వెంకటేష్ ను చంద్రబాబు ఊరుకుంటారా?. లేక రాజీ చేస్తారా? వేచిచూడాల్సిందే. రాజ్యసభ సీటు సమయంలోనే భారీ లావాదేవీలు జరిగాయని టీడీపీ వర్గాల్లోనే అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే ఆయన అంత ధైర్యంగా నారా లోకేష్ వ్యవహారంపై స్పందించి ఉంటారనే అభిప్రాయాలు కూడా పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.