ఎన్నికల సమయం. ఎవరు ఎవరిని కలసినా ఆసక్తికర పరిణామమే. ఈ నెల13న హైదరాబాద్ కు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీకి వైసీపీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. చంద్రబాబు రాజగురువు రామోజీరావును అమిత్ షా కలవటం వెనక మతలబు ఇది కాదా? అంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఓ కొత్త అస్త్రం వదిలారు. టీడీపీ, బిజెపిని కలపటానికే ఈ భేటీ జరిగిందని అంటూ బొత్స వ్యాఖ్యానించటం విశేషం. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య చంద్రబాబునాయుడు కూడా దేశంలో ఎవరితోనూ తనకు వివాదాలు లేవని...ఏపీకి ఇవ్వాల్సింది ఇస్తే చాలు అంటూ కొత్త కొత్త మాటలు మాట్లాడారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన సమయంలోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయటం, నితిన్ గడ్కరీ...చంద్రబాబులు అత్యంత సన్నిహితంగా మెలగటం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపింది. అసలు బిజెపి నేతలు ఎవరితోనూ కలవొద్దనే రీతిలో హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు తాను మాత్రం నితిన్ గడ్కరీతో విశాఖపట్నం సమావేశంలో మాత్రం నవ్వుతూ...అత్యంత చనువుగా వ్యవహరించారు.
ఇప్పుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనికితోడు వైసీపీ ఎంపీల రాజీనామాలను కేంద్రం కొంత జాప్యం చేసి అయినా సరే ఆమోదించింది. కానీ వైసీపీ ఫిరాయింపు ఎంపీల విషయంలో మాత్రం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం నిర్ణయం తీసుకోవటం లేదు. అదే రాజ్యసభ ఎంపీల విషయంలో మాత్రం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాత్రం ఎంతో వేగంగా స్పందించారు. వైసీపీ ఎంపీ టిక్కెట్లపై గెలుపొందిన బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి లు పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిపై చర్యలు తీసుకోవాలని గతంలో వైసీపీ పలుమార్లు ఫిర్యాదులు చేసింది. అయినా సరే...లోక్ సభ స్పీకర్ నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే బిజెపి, టీడీపీలు తెరవెనక రాజకీయం చేస్తున్నాయనే అనుమానం తలెత్తకమానదు.