అధికార తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తప్పులు చేస్తుంటే చూస్తూ కూర్చోబోమని..చొక్కాలు పట్టుకుని బయటకు లాక్కొస్తామని అన్నారు. మీరు ఏ తప్పులు చేసినా చూస్తూ కూర్చోకోవాలా?. ఎమ్మెల్యేలు అయితే ఏంటి?. మీకు ఏమైనా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే వైజాగ్ లో డాల్ఫిన్ కొండలను కూడా మింగేసేలా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇప్పుడు మా పార్టీకి కులం అంటగడుతున్నారు. మీరు పార్టీలు పెడితే కులాలు రావు... మేము పార్టీలు పెడితే కూలాలు గుర్తు వస్తాయా? నా దగ్గర వేల కోట్ల రూపాయలు... టీవీ ఛానల్స్ లేవు. అయినా ధైర్యంగా పోరాటం చేసే సత్తా ఉంది. 2014 ఎన్నికల్లో సాయం చేయమని తెలుగుదేశం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వెళ్లాను. నేను పోటీ చేయను...మీరు ప్రజలకు మంచి పాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరాను. మీరు హామీలు నిలబెట్టుకోని పక్షంలో మళ్లీ ప్రశ్నిస్తాను ఆ రోజే చెప్పాను. పోతే ప్రాణాలు పోతాయానుకుని ధైర్యంగా అడుగువేశా.
రాజకీయాలు అవసరమే. రాజకీయ నాయకులు అనుకుంటే ఒక సంతకంతో అన్నీ మారిపోతాయ్. ఒక్క పెన్నుపోటుతో ఉత్తరాంధ్ర 23 వెనకబడిన కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా దిగొచ్చారా.. మేం వారికి బానిసగిరీ చేస్తున్నామా..? చొక్కాలు పట్టుకుని రోడ్లపైకి లాగుతాం. ప్రజాసంక్షేమం కోసం వచ్చారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. ఎమ్మెల్యే .. ఎమ్మెల్యే కొడుకు.. ఎమ్మెల్యే అల్లుడు.. అందరూ రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలి. దోపిడీలు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోం. నాకు కుల పిచ్చి ఉంటే నేను మీకు ఎందుకు మద్దతు ఇస్తాను. చూస్తూ కూర్చుంటే రేపొద్దున డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారు” అన్నారు. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నేతలు జనసేనలో చేరారు.