అమరావతిని అడ్డుకుంటాం...పవన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-07-28 10:50 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది పడితే అది ఇష్టారాజ్యంగా చేసేయటానికి ఆంధ్రప్రదేశ్ ఏమీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంత రాజ్యం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ఇంకా రైతులను బలవంతం చేసి భూములు సేకరిస్తామంటే చూస్తూ కూర్చోబోమని అమరావతిని అడ్డుకుంటామని ప్రకటన చేశారు. మహారాష్ట్ర తరహాలో రైతులు అందరూ కలసి అమరావతి వచ్చి ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీని కోసం శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వస్తారని అన్నారు. అధికారులు కూడా సీఎం చెప్పారని ఏది పడితే అది చేయవద్దని కోరారు. రాజధాని కోసం 1850 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని చంద్రబాబు తనతో చెప్పారని అన్నారు.

కానీ అది కాస్తా ఇప్పుడు లక్ష ఎకరాలకు పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా?.. తోలు తీస్తాం అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రైతులెవరూ భయపడొద్దని కోరారు. కేసులు పెడితే ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో రైతులకు అండగా నిలబడకపోతే పాపం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. రాజకీయాలు కలుషితం అయిపోయాయన్నారు. అందుకే తాను ఎంతో కొంత బాగుచేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. పోరాటాలే కాకుండా వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేసి అధికారంలోకి వస్తామని సీపీఐ నాయకుడు రామకృష్ణ వ్యాఖ్యానించగా..పొత్తుల విషయం తర్వాత చూసుకుందామని..ఇప్పుడు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు రాహుల్ గాంధీకి కన్ను గొట్టి ఆయనతో కలసి పోగలరని ఎద్దేవా చేశారు

 

 

Similar News