జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అమరావతిలోని ఉండవల్లి ప్రాంతంలో రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కొంత మంది రైతులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ‘మీరు చెప్పారని ఆనాడు టీడీపీకి ఓటేశాం... ఇప్పుడు మా భూములను కాపాడాల్సిన బాధ్యత మీదే’ అంటూ పలువురు రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్ద వ్యాఖ్యానించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి ఉండవల్లికి మినహాయింపు ఇవ్వాలని, రోడ్డు నిర్మాణం పేరుతో ఉండవల్లి భూములను తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందంటూ రైతులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1200 అడుగుల రోడ్డు ఉండవల్లి మీదుగా వేస్తామనడం మమ్మల్ని వేధించడమని రైతులు పవన్ దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని అడ్డుకునే శక్తి కేవలం మీకు మాత్రమే ఉందంటూ రైతులు పవన్‌తో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పొలాలు లాక్కునేందుకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ప్రభుత్వానికి ఎదురుతిరగాలని రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. మూడు పంటలు పండే భూములను ప్రభుత్వం సేకరించకూడదని ఆయన అన్నారు. మూడు పంటలు పండే భూముల్ని మెట్ట పొలాలుగా చూపి దోపిడీ చేస్తారా అని ఆయన సర్కారును నిలదీశారు. మంత్రి నారాయణ పంట భూములను ట్రాక్టర్లతో దున్నారని, ఆయన రైతుల గురించి, వ్యవసాయం గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే భూదాహం తగ్గించుకోవాలని హితవు పలికారు. రైతుల భూములను ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందని, రాజధాని గ్రామాల్లో నియతృత్వంతో వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సింగూరు పోరాటం, బషీర్‌బాగ్ కాల్పుల వంటి ఘటనలు పునరావృతం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని పవన్ ప్రశ్నించారు.