ఈ దాడులు ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు తీసుకురానున్నాయా?. అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఈసీఎల్) చిరునామాపై ఏకంగా 47 కంపెనీలను ఉన్నట్లు తేలటం..అక్కడ రిజిస్టార్ ఆప్ కంపెనీస్ (ఆర్ వోసీ) అధికారులతో పాటు కార్పొరేట్ లా సర్వీసెస్ అధికారుల దాడుల వెనక కీలక సమాచారం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓ యువనేత గత కొంత కాలంగా ఈ కంపెనీ యాజమాన్య ప్రతినిధులతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. అంతే కాదు..కంపెనీకి చెందిన ఓ కీలక వ్యక్తితో కలసి కొంత కాలం క్రితం అమెరికా పర్యటన కూడా జరిపి వచ్చారనే సమాచారం వీరికి చేరినట్లు తెలిసింది. విదేశీ పర్యటన సమయంలో ఏమైనా నగదు లావాదేవీలు జరిగాయా?. జరిగితే ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి నిధులు వెళ్లాయి?. ఎంత మొత్తం వెళ్ళాయి అనే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నవయుగా ఇంజనీరింగ్ సంస్థ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే హవా చెలాయిస్తోంది. అంతే కాదు...వైఎస్ హయాంలో ఈ కంపెనీలో ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ కు పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించిన టీడీపీ నేతలు...తిరిగి అదికారంలోకి వచ్చాక అదే కంపెనీని అక్కున చేర్చుకున్నారు. దీని వెనక బలమైన కారణం ఆర్థిక లావాదేవీలే అనే ప్రచారం అధికార వర్గాల్లో కూడా వ్యక్తం అవుతోంది. లేదంటే ఓ ప్రైవేట్ సంస్థ చంద్రబాబుకు మేలు చేసేందుకు..వందల కోట్ల రూపాయల నష్టానికి పాత రేట్లకే పోలవరం కాంట్రాక్ట్ పనులు చేయటానికి ముందుకు వస్తుందా?. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది జరిగే పనేనా?. దీని వెనక అనేక రకాల ఆర్థిక కోణాలు ఉన్నందునే నవయుగా ఇంజనీరింగ్ ఇలా ముందుకొచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా యువనేతతో ఈ కంపెనీ యాజమాన్యానికి ఉన్న సంబంధాలపై కూడా అధికార వర్గాల్లో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి.
గతంలో ఎన్నడూలేని రీతిలో ఏపీలో ప్రస్తుతం అవినీతి వేల కోట్ల రూపాయల్లో సాగుతోందని.. ఈ నిధులను రూటింగ్ చేసేందుకు పలు కార్పొరేట్ సంస్థల సాయం తీసుకుంటున్నట్లు కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో సాగుతున్న అవినీతి వ్యవహారానికి సంబంధించి కేంద్రం ఎప్పటి నుంచో నిఘా పెట్టింది. పక్కా ఆధారాలతోనే ముందుకొచ్చే క్రమంలోనే ఇవన్నీ సాగుతున్నాయని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే ఒక్క ఏపీకి సంబంధించే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన యువనేతతో కూడా ఈ సంస్థ యాజమాన్యానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని...కొన్నిసార్లు ఆ యువనేత కృష్టపట్నం పోర్టు ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ లో కూడా కొన్ని రోజులు ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ వాడే ప్రత్యేక విమానం కూడా నవయుగా గ్రూప్ నకు చెందినదే అని అదికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు పోలవరంలో ఈ సంస్థకు విద్యుత్ ప్రాజెక్టు కూడా దక్కిన విషయం తెలిసిందే. తాజా దాడుల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.