నారా లోకేష్. తెలుగుదేశం పార్టీలో సెల్ఫ్ గోల్ స్పెషలిస్టుగా మారారనే వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. శనివారం నాడు కడపలో సీఎం రమేష్ నిరాహారదీక్ష వద్ద మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ‘కడప స్టీల్ ప్లాంట్’కు సంబంధించి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. కడప దీక్షా స్థలిలో నారా లోకేష్ మాటలు ఏంటో ఓ సారి చూద్దాం. ‘విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీకి ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు. చట్టంలో 13వ అంశం ఇది. అది కూడా ఆరు నెలల్లో. కేవలం ఆరు నెలల్లో శాంక్షన్ చేయాలని చట్టంలో ఉంది. నాలుగేళ్లు తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం ఓపిక పట్టింది. ఏదో ఏపీకి న్యాయం చేస్తారని ఓపిక పడితే..బిజెపి నాయకులు కూడా మనకు అన్యాయం చేస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం.’. అంటే దాదాపు నాలుగేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి కూడా విభజన చట్టంలో అంత స్పష్టంగా పేర్కొన్న స్టీల్ ప్లాంట్ ను కూడా టీడీపీ సాధించలేకపోయిందని నారా లోకేష్ ఒప్పుకున్నట్లు అయింది.
ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలు విభజన చట్టంలో లేవు. కానీ అంత స్పష్టంగా ఉన్న..వెనకబడిన జిల్లాకు చెందిన కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండగా...చంద్రబాబు కానీ..కేంద్ర మంత్రులు కానీ ఒక్కటంటే ఒక్క ప్రత్యేక సమావేశం కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం పెట్టిన దాఖలాలు లేవు. ఆరు నెలల్లోనే స్టీల్ ప్లాంట్ మంజూరు చేయాలని చట్టంలో అంత స్పష్టంగా ఉంటే.. అంత అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఈ విషయంలో దృష్టి సారించి..ప్రాజెక్టు సాధించలేకపోయారు?. కేంద్రంలో కొనసాగినంత కాలం అన్నీ వదిలేసి...హోదా బదులు ప్యాకేజీనే సూపర్..కేక అంటూ ప్రజలను నమ్మబలికి..ఇప్పుడు మాత్రం ‘రివర్స్ గేర్’ వేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే చట్టంలో లేదు...మరి స్టీల్ ప్లాంట్ గురించి చట్టంలో ఉన్నప్పుడు కోర్టులో కేసు వేసి ఎందుకు పోరాటం చేయదు?. అంటే టీడీపీకి కడప స్టీల్ ప్లాంట్ రావటం కంటే...రాజకీయ ప్రయోజనమే ముఖ్యం. అందుకే అటు చంద్రబాబు అయినా...ఇటు నారా లోకేష్ అయినా..ఎన్నికల వరకూ ఇలా ‘పోరాడుతూనే’ ఉంటారు.