ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మోడల్ అభివృద్ధి. దేశ రక్షణ కోసం పనిచేసే భారతీయ ఆర్మీ తమకు అమరావతిలో ఓ నాలుగు ఎకరాల స్థలం కావాలని కోరింది. సింగపూర్ సంస్థలకు...రియల్ ఎస్టేట్ వెంచర్లకు, బహుళ జాతి సంస్థలకు కారుచౌకగా భూములు ఇఛ్చేందుకు అలవాటు పడ్డ చంద్రబాబు...భారతీయ ఆర్మీకి మాత్రం ఎకరం కోటి రూపాయల లెక్కన కేటాయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం చూసిన ప్రభుత్వ అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో ఏ రేటు పెట్టినా పెద్దగా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు.
కానీ భారతీయ ఆర్మీకి ఉచితంగా భూమి ఇవ్వాల్సింది పోయి ఎకరం కోటి రూపాయల లెక్కన చెల్లింపులు చేయాల్సిందేనని జీవోలో పేర్కొన్నారు. కానీ చంద్రబాబుకు ఓ సారి ‘డ్యాన్స్’ నేర్పించిన ఈషా పాండేషన్ కు మాత్రం ఎకరం పది లక్షల రూపాయల లెక్కన ఏకంగా 10 ఎకరాలు కేటాయించారు. అదీ సీఆర్ డీఏ పరిధిలోనే. నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వుల్లో ఇచ్చిన ధరల వివరాలే ఇవి. నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ)కి రెండు ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.