ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో ఛానళ్లు చేతులు మారుతున్నాయి. అసలే ఎన్నికల సమయం. ఇప్పటికే రాజకీయం వేడి రాజుకుంటోంది. ఈ సమయంలో ఛానెళ్లు కూడా రాజకీయ రంగు పులుముకోబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు..మీడియాకు ఉన్న సంబంధం విడదీయరానిది. ప్రధాన ఛానళ్లు అన్నీ తటస్థ జపం చేసినా...అవి చూసే ప్రేక్షకులకు మాత్రం తెలుసు. ఎవరు ఎటువైపో. ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో. విచిత్రం ఏమిటంటే పక్షం రోజుల వ్యవధిలోనే కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు చేసిన రెండు ఛానెళ్లు టకటకా చేతులు మారటం విశేషం. ఇప్పటికే 10 టీవీ ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త చేతికి చేరింది. ఈ మధ్యే ఈ లావాదేవీ పూర్తయింది. అయితే అధికారికంగా కాకుండా ఆయన వేరే పేరుతో ఛానల్ తీసుకున్నట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఛానల్ చేతులు మారిన విషయం మాత్రం పక్కా. తాజాగా సీపీఐకి చెందిన 99 టీవీ కూడా అదే బాటలో పయనించింది. అయితే నేరుగా పవన్ కళ్యాణ్ ఈ ఛానల్ ను టేకోవర్ చేయకపోయినా..జనసేనలో కీలకంగా ఉన్న నేతలే ఈ ఛానల్ ను దక్కించుకోవటంతో ఎన్నికల సమయంలో ఇది జనసేనకు ఉపయుక్తంగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎంపిక చేసిన ఛానళ్లు తప్ప..పవన్ కళ్యాణ్ రాజకీయ టూర్లకు పెద్దగా కవరేజ్ ఇస్తున్న దాఖలాలు లేవు. పైగా ఈ మధ్య పలు ప్రధాన ఛానెళ్ల అధినేతలను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. పైకి కన్పించకపోయినా ఈ కోపం వారిలో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకే కొంత మంది తమ ఛానళ్లలో ఏవేవో నినాదాలు వేస్తూ పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. అయితే జనసేన చేతికి ఛానల్ రావటంతో మీడియా రాబోయే రోజుల్లో పవన్ ను మరింత టార్గెట్ చేయటం ఖాయం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రధాన మీడియా సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయి. అందుకే తాము ‘ఎత్తుకున్న’ వారు ఎన్ని తప్పులు చేసినా వదిలేసి...ఆ పార్టీ ప్రత్యర్ధులపై మాత్రం దుష్ప్రచారం మాత్రం ఏ మాత్రం వెరవకుండా చేస్తారు. దీంతో పార్టీలకు ఛానళ్ల అండ కూడా అనివార్యం అవుతోంది. అయితే ఒక్క ఛానళ్ళు మాత్రం గెలుపు తీరం చేర్చేటట్లు అయితే..పార్టీలు అన్నీ ముందు అదే పనిచేస్తాయి. కాకపోతే అవి కొంత మేర ఉపయోగపడతాయనటంలో సందేహం లేదు. ప్రత్యర్ధి పార్టీలు అన్ని రకాలుగా బలమైనవి కావటంతో కనీసం తమ వాయిస్ విన్పించుకోవటానికి అయినా ఛానళ్ళు ఉపయోగపడతాయన్నది ఆయా పార్టీల అంచనా. జనసేనకు అలాగే ఈ టీవీ 99 ఉపయోగపడటం ఖాయం. ఈ ఛానల్ ను ఆదిత్య గ్రూప్ అధినేత తోట చంద్రశేఖర్ తీసుకున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున బరిలో నిలవనున్నారు. అంటే ఆ ఛానల్ ఇక జనసేన బాటలో పయనించటం ఖాయం.