తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంతంగా అభివృద్ధి చేయలేరా?. అంత అనుభవం ఉండి కూడా ఆయనకు వీరిద్దరి సహకారం అవసరం పడుతుందా?. ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ వ్యూహాన్ని అమలు చేసుకుంటుంది. ప్రజలు ఎవరిని నమ్ముతారో వారికే ఓటేస్తారు. కానీ సీఎం చంద్రబాబునాయుడు గత కొంత కాలంగా వైసీపీ, జనసేన లు బిజెపితో కుమ్మక్కు అయి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. నిజంగా ఈ రెండు పార్టీలు అడ్డుకోవటం వల్ల ఏపీలో ఆగిపోయిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా?. అంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటే పనిచేయలేని చేతకాని స్థితిలో చంద్రబాబు ఉన్నారనుకోవాలా?. అధికార పార్టీ రాష్ట్రానికి...ప్రజలకు ఏమి కావాలో అది చేయాలి?. నారా చంద్రబాబు, నారా లోకేష్ లు పవర్ ఎంజాయ్ చేస్తూ...విదేశీ, దేశీయంగా విహార యాత్రలు చేస్తుంటే...వాళ్ల తరపున జగన్, పవన్ పోరాడాలా?. గత ఎన్నికల ముందు అలా చెప్పలేదే?.
జగన్ కు అనుభవం లేదు..నేనొస్తేనే అన్నీ చేస్తా అని కదా? చెప్పింది. గత ఎన్నికల్లో కలసి పోటీచేసిన టీడీపీ, బిజెపి ఏమీ చేయలేక ఇప్పుడు ఆ నెపాన్ని జగన్, పవన్ పై మోపితే ప్రజలు నమ్మేస్తారా?. అంటే అధికారంలో ఉండి చంద్రబాబు చేయలేని పనులను...బయట ఉన్న వీరిద్దరూ అడ్డుకుంటున్నారా?. అంటే చంద్రబాబు ఈ విషయమే చెప్పదలచుకున్నారా?. పట్టిసీమలో చంద్రబాబు దోపిడీని వీళ్లు అడ్డుకోగలిగారా?. పోలవరంలో అక్రమాలను ఆపగలిగారా?. సింగపూర్ సంస్థలకు వేల ఎకరాల భూమిలిచ్చి..వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలికసదుపాయాలు కల్పిస్తామంటూ జీవోలు ఇచ్చి దేశంలోనే అతి పెద్ద స్కామ్ కు తెరతీస్తే వీరిద్దరూ అడ్డుకోలిగారా?. చెట్టు-నీరు పథకంలో జరిగిన అవినీతిని అడ్డుకోగలిగారా?. ఇసుక దోపిడీని ఆపగలిగారా?. సోలార్ పవర్ టెండర్ల గోల్ మాల్ ను అడ్డుకోలిగారా?. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ మాకు 25 ఎకరాలు చాలు అని అడిగితే...చాలదు..చాలదు అంటూ 40 ఎకరాలు ఇఛ్చేసి దాదాపు 150 కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపితే అడ్డుకోగలిగారా?. రాజధాని కోసం అని రైతులిచ్చిన భూమితో అడ్డగోలుగా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్నా అడ్డుకోలిగారా?.
కట్టిన తాత్కాలిక రాజధానిలో చోటుచేసుకున్న అవినీతి..ఈ భవనాల్లో కురుస్తున్న వర్షాలను అడ్డుకోగలిగారా?. అమరావతిలో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి మొక్కల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ చేస్తే ఆపగలిగారా?. ఎన్నికలకు ముందు రైతులకు బ్యాంకు రుణాలు ఎంత ఉంటే అంత మొత్తం మాఫీ చేస్తామని..అధికారంలోకి వచ్చాక తూచ్ అంటే ఏమైనా చేయగలిగారా?.సాగునీటి ప్రాజెక్టుల్లో అడ్డగోలు అంచనాల పెంపును అడ్డుకోగలిగారా?. ప్రజలు చేసే పండగలను కూడా ప్రభుత్వ కార్యక్రమాలుగా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని నిలువరించగలిగారా?. జగన్..పవన్ కారణం వల్ల ఏపీలో తాను ఈ పనిచేయలేకపోయాయని చంద్రబాబు చెప్పగలరా?. అయినా ప్రతిపక్షాలు అడ్డుకుంటే పరిపాలన చేయలేని నాయకుడు...నాయకుడు ఎలా అవుతారు?.