ఒకరు కేంద్రంతో గొడవ పెట్టుకుంటే ఏపీ ప్రగతి ఆగిపోతుందని అన్నారు. మరోకరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఏపీ కుంటుపడిపోతుందని ఫీల్ అయ్యారు. అందులో ఒకరు చంద్రబాబు అయితే..మరొకరు పవన్ కళ్యాణ్. వీరిద్దరికి పెద్ద తేడా ఏముంది?. నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నేత రాజకీయం ఒకటే..నాలుగేళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిదీ అదే బాట. బిజెపి, టీడీపీ కలసి సాగిన రోజుల్లో ఎవరైనా ప్రత్యేక హోదాను గట్టిగా అడగమని ప్రశ్నిస్తే కేంద్రంతో ఘర్షణకు దిగితే ఏపీలో ప్రాజెక్టులు ఆగిపోతాయంటూ అసెంబ్లీ సాక్షిగా దీర్ఘాలు తీశారు చంద్రబాబు. కానీ చివరకు చంద్రబాబే బాబోయ్ మోడీ మోసం చూశారా? అంటూ గగ్గోలు పెడుతూ బయటకు వచ్చారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ రాజధాని కోసం ప్రత్యేక ప్రకటన ఏమీ చేయకుండా మట్టి..నీళ్లు ఇచ్చినప్పుడే ప్రజలకు చాలా క్లారిటీ వచ్చింది. ఒక్కచంద్రబాబుకు తప్ప. కానీ ఆర్థిక అవసరాల కోసం ఆయన అలా చివరి వరకూ నెట్టుకొచ్చారు. ఇప్పుడు కావాల్సింది రాజకీయ ప్రయోజనం కాబట్టి..అది బిజెపి..మోడీతో ఉంటే నష్టం కాబట్టి ‘తూచ్’ బిజెపితో పొత్తు కటీఫ్ అని తేల్చారు.
అవినీతిలో మునిగిపోయిన జగన్ కంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబే భేష్ అంటూ జనసేన తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్ల నుంచి చంద్రబాబు వరస పెట్టి స్కామ్ లు చేస్తున్నా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని పవన్ కళ్యాణ్ కూడా మూడున్నర సంవత్సరాల అనుభవం తర్వాత అసలు విషయం అర్థం చేసుకున్నారంట. తాను మాట్లాడితే ఏపీ ప్రగతి ఎక్కడికి అక్కడే ఆగిపోతుందనే భ్రమల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పట్టిసీమ స్కామ్, పోలవరం అక్రమాలను..స్విస్ ఛాలెంజ్ దోపిడీని ఏ మాత్రం ప్రశ్నించలేదు. అంతే కాదు..స్వయంగా టీడీపీ నేతల పాత్ర ఉన్న..రాజధాని కేంద్రంగా సాగిన కాల్ మనీ సెక్స్ రాకెట్ పైనా పవన్ గట్టిగా మాట్లాడింది లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ లాగా పవన్ ఏదో ఒక చిన్న సమస్యను ప్రస్తావించటం..అసలు ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి, నాయకుడు అంటే పవన్ లా మాట్లాడాలి అంటూ..చంద్రబాబు, టీడీపీ నేతలు హంగామా చేయటం తెలుగు ప్రజలు కళ్ళారా చూశారు.
చంద్రబాబు రాజకీయం గురించి ఎవరిని అడిగినా చెబుతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా మూడున్నరేళ్ళుపైనే చంద్రబాబుకు కొమ్ముకాశారు. గత ఎన్నికల ముందు మోడీ, చంద్రబాబు, పవన్ అందరూ కలసే ప్రచారంలో తిరిగారు. మోడీ ప్రదాని అయితే... చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే..అటు దేశం..ఇటు రాష్ట్రం పరుగులు పెడతాయి అని ప్రకటించారు. మోడీ..బాబు జోడీ భేష్ అంటూ వాగ్దానాలు చేశారు. కానీ మూడున్నర సంవత్సరాల తర్వాత మోడీకి బాబు ఝలక్ ఇస్తే...చంద్రబాబుకు పవన్ కూడా అదే స్థాయిలో షాక్ ఇఛ్చారు. ఈ లెక్కన ఇద్దరికీ తేడా ఏముంది?. నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబుదీ అదే వైఖరి. నాలుగేళ్ల అనుభవం ఉన్న పవన్ దీ అదే దారి.