ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో మొదట నుంచి ఒకటే మాట మీద ఉన్నది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ‘ప్రత్యేక హోదా’ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో ప్రజలకు వివరించి మరీ చెప్పే ప్రయత్నం గట్టిగా చేసింది వైసీపీ. కానీ రాజకీయంగా తీసుకున్న ‘ఎంపీల రాజీనామా’ నిర్ణయం వల్ల ఆ పార్టీ ఇప్పుడు అసలు ‘సీన్’ లో లేకుండా పోయినట్లు అయింది. నాలుగేళ్లకు పైగా ఇదే అంశంపై పోరాటం చేసి..పార్లమెంట్ లో అవిశ్వాసం చర్చకు వచ్చే సమయంలో వైసీపీ నుంచి ఎవరూ సభలో ప్రాతినిధ్యం వహించే పరిస్థితి లేకపోవటం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. అసలు ప్రత్యేక హోదా కోసం ‘అవిశ్వాసం’ అంశం తెరపైకి తెచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డే. కానీ దేశమంతా ఈ అంశంపై ఫోకస్ ఉన్న తరుణంలో వైసీపీ ‘ఫోకస్’ లేకుండా పోయింది. విచిత్రం ఏమిటంటే ‘ప్యాకేజీ బాబు’ మాత్రం ఇప్పుడు అసలు ‘ప్రత్యేక హోదా’ ఛాంపియన్ తానే అన్న చందంగా హంగామా చేస్తూ...ఫోకస్ అంతా తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు.
రాజకీయంగా చంద్రబాబు ఈ విషయంలో ప్రస్తుతం ఎడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు. అయితే ఈ అవిశ్వాస తీర్మానంతో ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతుంది..మోడీ హామీల విస్మరణ వంటి అంశాలను ప్రస్తావించగలుగుతారే తప్ప...దీని వల్ల ప్రత్యేక హోదా రాదు..మోడీ సర్కారు పడిపోదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా రాజకీయ లబ్దితోపాటు..దేశంలోనే మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టిన పార్టీగా టీడీపీ క్రెడిట్ కొట్టేయనుంది. అయితే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వేసిన ‘పిల్లిమొగ్గల’ను బిజెపి నేతలు పార్లమెంట్ లో ఎంత సమర్థవంతంగా ఎండగడతారు అన్న అంశంపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు సభ వెలుపల ‘ధర్నా’ చేస్తూ నించుకోవాల్సి రావటంతో వాళ్లను చూసిన సొంత పార్టీ నేతలే నిట్టూర్పు విడుస్తున్నారు. జగన్ తీసుకున్న ఓ పొరపాటు నిర్ణయం వల్ల ‘ప్యాకేజీ బాబు’ ముందుకెళితే...ఫైటింగ్ చేసిన జగన్ వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.