ముందస్తు అంటే బెదురుతున్న చంద్రబాబు

Update: 2018-07-06 07:37 GMT

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సడన్’ గా ఎందుకు మాట మార్చారు. నిన్న మొన్నటి వరకూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలంటే పార్టీ శ్రేణులను ఆదేశించిన ఆయన..ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు. అసెంబ్లీ ముందస్తుకు ఒప్పుకోబోమని..అవసరం అయితే న్యాయపోరాటం చేస్తామని ప్రకటించటం వెనక మతలబు ఏమిటి?. డిసెంబర్, జనవరిలో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే ఆందోళన చంద్రబాబులో ఉందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంట్ కు ఓకే అన్నప్పుడు..అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం భయం ఎందుకు ఉండాలి?. చట్టబద్దంగా వచ్చే మే వరకూ ఏపీ అసెంబ్లీకి గడువు ఉంది. ఇందులో ఎలాంటి వివాదాలకు తావులేదు. కానీ ఆరు నెలల్లోపు గడువు ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇటీవల వరకూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలంటూ శ్రేణులను ఉత్తేజపరిచిన ఆయన ఇప్పుడు ఈ విషయంలో స్టాండ్ మార్చుకున్నారు. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

గత కొన్ని నెలలుగా ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతోంది. ఈ పాదయాత్రకు అన్ని జిల్లాలో ప్రజల నుంచి ఆదరణ కూడా బాగానే ఉంటుంది. ఈ విషయంలోనే టీడీపీ తర్జనభర్జన పడుతోంది. డిసెంబర్ లోపు ఎన్నికలు వస్తే జగన్ పాదయాత్ర ప్రభావం ఓటర్లపై ఉంటుందని..అదే షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ప్రభావం కొంత మేర అయినా తగ్గటం ఖాయం అని..దీని వల్ల లబ్దిపొందవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉన్న సమయాన్ని వదులుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లటం ద్వారా ప్రతిపక్షానికి ఎందుకు మేలు చేయాలని చూస్తామని ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ ముందస్తు ససేమిరా అంటూ కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించటం. పార్లమెంట్ కు మాత్రం ఓకే..అసెంబ్లీకి మాత్రం వద్దంటున్నారు. అందులోని లాజిక్ అర్థం చేసుకోవటం సులభమే.

ఓ వైపు జగన్, మరో వైపు పవన్ కళ్యాణ్ లు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు..అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆధారాలతో సహా విషయాలు బయటపెడుతున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ సారి తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. ఈ అంశాలు అన్నింటిని పరిగణనలోకి తీసుకునే చంద్రబాబు ఎన్నికలపై యూటర్న్ తీసుకున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీ ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన రాజధాని అమరావతి కూడా ఎక్కడ వేసిన గొంగళి మాదిరి అక్కడే ఉంది. ఈ అంశాలు అన్ని చంద్రబాబును ముందస్తు అంటే భయపడేలా చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన దోపిడీకి ‘కేబినెట్’నే అడ్డంగా వాడేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Similar News