చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. బుధవారం నాడు ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జలవనరులు, రవాణా శాఖమంత్రి గడ్కరీ లేవనెత్తిన ప్రశ్నలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పెరిగితే పరిహారం పెరగాలి కానీ ..భూ విస్తీర్ణం ఎలా పెరుగుతుందని గడ్కరీ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే దీనికి అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. ప్రాజెక్టు రూపకల్పన సమయంలోనే ఎంత భూమి సేకరించాలనే అంశాన్ని నిర్ధారిస్తారు. అంతే కానీ..భూ సేకరణ చట్టాన్ని మార్చినందున ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన భూమి పెరగదు కదా?. అన్న సందేహన్ని గడ్కరీ లేవనెత్తారు. అయితే కేంద్రం ఫోకస్ పెడితే పోలవరంలో ప్రభుత్వం పలు అంశాల్లో చిక్కుల్లో పడటం ఖాయం అని సాగునీటి శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఎందుకంటే అంత అడ్డగోలుగా సాగుతున్నాయి అక్కడి వ్యవహారం.
పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) అనుమతి లేకుండానే ఏపీ సర్కారు ఇష్టానుసారం ముందుకు సాగుతోంది. పైగా కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వటం లేదని చెబుతూ నెపాన్ని మోడీ సర్కారుపై మోపుతోంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం మీడియతో మాట్లాడిన గడ్కరీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పాత డీపీఆర్‌కు ప్రస్తుత డీపీఆర్‌కు అసలు పోలికే లేదని, ఎందుకు అంతగా మార్పులు చోటుచేసుకున్నాయో చూడాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి అక్కడే మూడు రోజులు పాటు ఉండాలని గడ్కరీ చంద్రబాబుకు సూచించారు. జల వనరుల శాఖకు ప్రాజెక్టుపై అవసరమైన వివరాలన్నీ సమర్పించాలని చెప్పారు.
ఆ తర్వాత ఎనిమిది రోజుల్లో అన్ని క్లియరెన్సులు ఇచ్చి నిధుల పెంపు కోసం ఆర్థిక శాఖకు ఫైల్ పంపుతానని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. నిధుల గురించి బెంగపడాల్సిన పని లేదని అన్నారు. అభివృద్ధి, రాజకీయం రెండు వేర్వేరని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తేడాలుంటే వీధుల్లో పోరాడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుందో నాకు బాగా తెలుసని అన్నారు. అందుకే ప్రాజెక్టు నిర్మాణానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు మోడీ సర్కారు ఇస్తున్నందున ఈ విషయాన్ని ఏపీ ప్రజలకు చెప్పాలని గడ్కరీ తర్వాత బిజెపి నేతలు..కార్యకర్తలకు సూచించారు. అంతకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ. 57, 940 కోట్లని పేర్కొన్నారు. ఇందులో భూ సేకరణ నిమిత్తం రూ. 33 వేల ఖర్చు అవుతుందని చెప్పారు. 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.