తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్లాన్ ను బిజెపి దెబ్బకొట్టిందా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడండి అంటూ బిజెపి నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.. లోక్ సభలో ఏపీకి చెందిన అంశంపై చర్చించిన తర్వాత బిజెపి తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్ సభలో ‘అవిశ్వాస తీర్మానం’ చర్చ సందర్భంగా తెలుగుదేశం ఎంపీలు ఏమి చెబుతారో తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. వినీవినీ ప్రజల చెవుల్లో అవే ప్రతిధ్వనిస్తున్నాయి. ఎందుకంటే ఏ ఛానల్ పెట్టినా అవే..ఏ పత్రిక చూసినా అదే. మరి ఇప్పుడు లోక్ సభ సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీ కానీ... కేంద్ర మంత్రులు చంద్రబాబు ‘అసలు బండారం’ బయటపెడతారా?. పెట్టరా?. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకుని..అసెంబ్లీ తీర్మానాలు చేసి...అభినందన లేఖలు రాసిన రహస్యాలను దేశ ప్రజల ముందు ఉంచుతారా?. అలా చేస్తే అప్పుడు చంద్రబాబుకు వచ్చే లాభం కంటే జాతీయ స్థాయిలో పరువు పోతుందా?. అన్న చర్చ టీడీపీ ఎంపీల్లో మొదలైంది.
ప్రత్యేక హోదాకు సంబంధించి .ప్రజల్లో హోదా సెంటిమెంట్ ఉందని గ్రహించి చివరి నిమిషంలో ‘ప్లేటుమార్చిన’ బాబు అసలు ఉద్దేశాన్ని బిజెపి నేతలు సమర్థవంతంగా సభలో చెబుతారా? లేదా?. అన్నదే ఇప్పుడు అందరిలో ఉన్న టెన్షన్. అసలు బిజెపి ఇంత తేలిగ్గా అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తుందని తెలుగుదేశం అధినేత, టీడీపీ ఎంపీలు కూడా ఊహించలేదు. గత సమావేశాల తరహాలోనే ఈ సారి కూడా ఒప్పుకోరు..రోజూ సభకు పోయి...నినాదాలు చేసి బయటకు వచ్చి ‘ప్రత్యేక హోదా’ కోసం పోరాడాం అని చెప్పుకునేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ కు బిజెపి ఆదిలోనే దెబ్బకొట్టిందనే అభిప్రాయం విన్పిస్తోంది. రాజకీయ కారణాల పరంగా ఆలోచించి భవిష్యత్ లో టీడీపీ పొత్తు అవసరం అవుతుందనో లేదా ఆ పార్టీని కాంగ్రెస్ వైపు చూడకుండా నిలువరించాలంటే మధ్యే మార్గంగా సభలో పెద్దగా దాడి చేయకుండా వదిలేస్తారా?.
అలా చేస్తే ప్రధాని మోడీతోపాటు...బిజెపి కూడా బయట టీడీపీపై ఆరోపణలు..లోపల కౌగిలింతలా అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బిజెపి మాత్రం ప్రస్తుతం ఆ మూడ్ లో లేదని...తాడోపేడో తేల్చుకోవటానికే సన్నద్ధంగా ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఎంపీలు ఎంత చెప్పినా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని..రైల్వే జోన్ ఇస్తామని, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని ఇలాంటి నెరవేరని హామీలను ప్రస్తావించటం తప్పపెద్దగా చేయగలిగింది ఏమీలేదు. కానీ అదే కేంద్రం అసలు విషయాలు చెప్పదలచుకుంటే ఆ కథలు ఎన్నో!. ఈ సస్పెన్స్ శుక్రవారం రాత్రి వరకూ కొనసాగనుంది. అయితే ఓ సారి లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగాక దీనిపై ఇక చెప్పుకోవటానికి చంద్రబాబుకు కూడా పెద్దగా ఏమీ ఉండదు.