దీక్షలు..ధర్నాలతో ప్రతిపక్ష పాత్రకు టీడీపీ ప్రాక్టీస్!

Update: 2018-06-21 04:28 GMT

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటింది. పాలించటంలో ఫెయిల్ అయ్యాం. ప్రజల ఆశలు..ఆకాంక్షలు నెరవేర్చటంలో విఫలం అయ్యాం. కానీ పోరాటాలు చేయటంలో మాత్రం సక్సెస్. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒక్క రోజు దీక్ష. ధర్మపోరాటాలు. మరో వైపు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ‘ఉక్కు దీక్ష’. పాలించమని ప్రజలు అధికారం ఇస్తే ...మాకు అది చేతకాదు..మేం పోరాటం చేస్తామంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి, మంత్రులు..ఎంపీలు దీక్షలు చేస్తే ప్రతిపక్షాలు ఏమి చేస్తాయి?. మనకు తెలిసిన అరకొర రాజ్యాంగ ప్రకారం అధికార పార్టీ పాలించాలి.ప్రతిపక్షం ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలి..ప్రజల తరపున పోరాడాలి. మరి ప్రభుత్వంలో ఉండి..మేం రాష్ట్రానికి రావాల్సినవి చట్టబద్ధంగా సాధించలేం. పోరాటం తప్ప అని తెలుగుదేశం పార్టీ..అదీ ముఖ్యమంత్రే చెపితే ప్రజలు ఓకే అంటారా?. వాస్తవానికి కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్రం. అసలు అక్కడ ప్రాజెక్టు లాభదాయకమా కాదా? అన్నది వేరే అంశం. కానీ విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ అంశం ఉంది. కానీ చంద్రబాబు ‘రాజ్యాంగం’ ప్రకారం సీఎం రమేష్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కదా?.

కడపలో చేస్తే ఏమి వస్తుంది?. సీఎం రమేష్ చంద్రబాబుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారా?. చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ నేతలు చెప్పే లాజిక్ ప్రకారం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలోనీ కానీ..కడపలో కాదు కదా?. ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టింది కూడా చంద్రబాబే కదా?. మరి ఇప్పుడు ఎందుకు ఈ సిద్ధాంతం తప్పింది.. చంద్రబాబు తాను చెబుతున్న అలిఖిత రాజ్యాంగ ఉల్లంఘన ఎందుకు జరుగుతున్నట్లో?. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడప స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ నాలుగేళ్లలో వెనకబడిన కడప జిల్లా ప్రాజెక్టు కోసం ఎందుకు కేంద్రంపై ఒత్తిడి చేయలేదో?.

ఎన్నికలకు సమయం దగ్గర అవుతుండటం..అదీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చెందిన జిల్లా కావటంతో ఈ దీక్షల ద్వారా అయినా నాలుగు ఓట్లు సంపాదించుకోవాలన్న ఆలోచన తప్ప...ప్రాజెక్టుపై సర్కారుకు చిత్తశుద్ధి ఉన్నట్లు ఎక్కడా కన్పించదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే...విభజన వల్ల ఏపీ నష్టపోతుంది కాబట్టి...ఏమేమి చేస్తారో స్పష్టంగా చట్టంలో పెట్టి మరీ చేశారు. మరి చట్టంలో ఉన్న అంశాలపై ఏపీ సర్కారు కోర్టును ఆశ్రయించకుండా జాప్యం చేయటం వెనక కారణం ఏమిటి?. అది కూడా చివరి నిమిషంలో చేసి..రాజకీయ లబ్ది పొందటానికే ప్రయత్నం చేస్తారేమో?.

Similar News