పవన్ తప్పును పట్టుకుని...తన స్కామ్ ను కప్పెట్టిన లోకేష్

Update: 2018-06-09 12:31 GMT

ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ నిఖార్సైన రాజకీయ నాయకుడిగా పరిణితి సాధిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్కామ్ గోల్ మాల్ ను ప్రస్తావిస్తే లోకేష్ ఆయన మాటల్లోని తప్పును పట్టుకుని...తన స్కామ్ ను కప్పి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఫ్లాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి భూమి ఇచ్చారని అన్న మాట వాస్తవమే. దీనిపై నారా లోకేష్ తనదైన సహజశైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫ్లాంక్లిన్ టెంపుల్టన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని...అదో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటని లోకేష్ తెలిపారు. 450కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ఈ కంపెనీ 2500 మందికి ఉద్యోగాలు కల్పించబోతుందని తెలిపారు. అంత వరకూ ఓకే. కానీ అసలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖపట్నంలో అడిగింది 25 ఎకరాలు అయితే...సర్కారు ఆ కంపెనీకి 40 ఎకరాల భూమి ఎందుకు ఇఛ్చింది. తొలి జీవోలో ఉన్న ఇన్నోవా సొల్యూషన్స్ సవరణ జీవోలో ఎందుకు ఎగిరిపోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తొలి దశలో పది ఎకరాలు మాత్రమే ఇవ్వాలని..రేటు కూడా ఏపీఐఐసీ నిర్దారించిన ధర తీసుకోవాలని సిఫారసు చేస్తే కేబినెట్ ముందు పెట్టి మరీ అడ్డగోలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది?.

మాట్లాడితే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరే లోకేష్...జీవోల సాక్షిగా ఉన్న అక్రమాలపై మాత్రం నిత్యం మౌనం దాలుస్తూ..తనకు అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రం అనుకూల పత్రికల్లో ప్రచారం చేసుకుంటారు. అసలు ఇన్నోవా సొల్యూషన్స్ ఎందుకు వచ్చింది. ఎందుకు అకస్మాత్తుగా మాయం అయింది. ఇందులో స్కామ్ ఏమీ లేకపోతే. అసలు రెండు కంపెనీలు జాయింట్ గా కలసి భూమి అడగటం ఎక్కడైనా ఉంటుందా?. ఇది అంతా దోపిడీ స్కీమ్ కాదా?. ఇన్నోవా సొల్యూషన్స్ తెరపై నుంచి తప్పుకన్నా..స్కామ్ మాత్రం అలాగే కొనసాగుతుంది. అత్యంత ఖరీదైన విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో 25 ఎకరాలు అడిగితే ప్రభుత్వం 40 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది. పవన్ తప్పులను ఎత్తిచూపటంతో పాటు....అడిగిన దాని కంటే ఎక్కువ భూమి ఎందుకు ఇచ్చారో కూడా చెప్పి ఉంటే బాగుండేది.

 

Similar News