ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కంటే సినీ నటుడు శివాజీనే బెటరా?. అంత పెద్ద వ్యవస్థ పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం కనుక్కోలేని విషయాన్ని ఓ సినీ నటుడు కనిపెట్టగలరా?. ఓకే. అదే నిజమనుకుందాం?. మరి ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పుకున్నట్లేనా?. ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ‘ఆపరేషన్ గరుడ’ ప్రారంభం అయిందని..ఇది వివిధ దశల్లో అమలు కానుందని శివాజీ కొద్ది రోజుల క్రితం విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. దీని కోసం వేల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారని కూడా శివాజీ వెల్లడించారు. ఇప్పటికే ఇది ప్రారంభం అయిందని ఆయన తేల్చేస్తే...దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు విన్పించాయి. చంద్రబాబు, మోడీల జోడీ నాలుగేళ్లు కలసి సాగింది. తర్వాత చంద్రబాబు ఈ జోడీ మాకు సెట్ కాలేదు అంటూ బయటకు వచ్చారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టడానికి చూస్తుంది. అది చంద్రబాబు అయినా...మోడీ అయినా అలాగే చేస్తారు. అయితే ఏపీ విషయానికి వస్తే బిజెపికి పెద్దగా పట్టు లేదు అక్కడ . సొంతంగా ఓ రెండు సీట్లు కూడా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. అలాంటిది ఏపీలో ఆపరేషన్ గరుడుకు ఏకంగా 4500 కోట్ల రూపాయలుపైనే ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు.
వాస్తవానికి నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు 2625 కోట్ల రూపాయలకు మించి కాదు. పోనీ ఇతర ఖర్చులు మరో 400 కోట్లు వేసుకున్నా మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు దాటదు. కానీ ఏకంగా ఒక్క ఏపీ కోసం 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ గరుడ అమలు చేస్తున్నారా?. అన్నింటి కంటే విచిత్రం ఏమిటంటే శనివారం నాడు విజయవాడలో నిర్వహించినన ‘నవనిర్మాణ దీక్ష’లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శివాజీ లేవనెత్తిన ‘ఆపరేషన్ గరుడ’ అంశాన్ని సభలో ప్రస్తావించారు. అంటే చంద్రబాబు నిజంగా దీన్ని నమ్ముతున్నారా?. నమ్మితే ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని అంగీకరించినట్లే అవుతుంది?. కాదు అంటే కేవలం ప్రజల్లో సానుభూతి పొందటానికి దీన్ని వాడుకున్నారని భావించకతప్పదు. అంటే ఓ వ్యవస్థ ఉన్న చంద్రబాబు సర్కారు కనిపెట్టలేని అంశాన్ని...అసలు ఏ మాత్రం సినిమాలు లేని..కొంత మంది మీడియా అధినేతలకు సన్నిహితుడు అయినా శివాజీ ద్వారా తెలుసుకోవాల్సి రావటం చంద్రబాబు ప్రతిష్టకు మచ్చ కాదా?.