ఎన్నికల సమయం కావటంతో సర్వేల జోరు కూడా పెరుగుతోంది. ఎవరికి వారు పరిస్థితిని మదింపు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా భవిష్యత్ జంపింగ్ లు కూడా ఉండబోతున్నాయి. ఎన్నడూలేని రీతిలో ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో పోటీ త్రిముఖమా లేక చతుర్ముఖమా తేలాల్సి ఉంది. గత ఎన్నికల తరహాలో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచే అవకాశం లేదు. ఈ తరుణంలో ఏ చిన్న మార్పు అయినా గెలుపు ఓటములను నిర్ణయించగలదు. ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పరిస్థితిని ఓ సంస్థ మదింపు చేసింది. ఈ సర్వే ప్రకారం తాజా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ముందు కృష్ణా జిల్లా విషయానికి వస్తే గత ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీ చేసిన ఆ పార్టీ గత ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకోగా..ప్రదాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అభ్యర్ధులు 5గురు గెలిచారు. ఆ తర్వాత కొంత మంది పార్టీ ఫిరాయించారు. అది వేరే సంగతి. ఆ పార్టీ గుర్తుపై గెలిచింది మాత్రం ఐదుగురు. ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే మైలవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, పామర్రు, తిరువూరు, విజయవాడ సెంట్రల్ లో తీవ్ర పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి పక్కగా ఉన్న సీట్ల విషయానికి వస్తే అధికార టీడీపీ గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, కైకలూరు గెలిచే పరిస్థితి కన్పిస్తోంది.
ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ గుడివాడ, మచిలీపట్నం, నందిగామ, నూజివీడు, పెడన, విజయవాడ వెస్ట్ గెలిచే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తుంటే అధికార టీడీపీకి దెబ్బపడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇక 17 సీట్లు ఉన్న గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కూడా సంచలన ఫలితాలే నమోదు అయ్యే అవకాశం కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 12 సీట్లు దక్కించుకోగా..ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ 5 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే గుంటూరు ఈస్ట్, పెదకూరపాడు, రేపల్లే నియోజకవర్గాల్లో గట్టి పోటీ నెలకొననుంది. అధికార టీడీపీ చిలకలూరిపేట, గురజాల, పొన్నూరు, తాడికొండ, తెనాలి, వేమూరు, వినుకొండ సీట్లను మాత్రమే దక్కించుకునే అవకాశం కన్పిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ బాపట్ల, గుంటూరు వెస్ట్, మాచర్ల, మంగళగిరి, నరసరావుపేట, ప్రత్తిపాడు, సత్తెనపల్లి సీట్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫీల్డ్ లో కి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనల జోరు మరింత పెరిగి..అభ్యర్ధులను ఖరారు చేస్తే ఈ పరిస్థితుల్లో కొంత మార్పులు ఉండొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే ఈ సర్వే తెలియజేస్తుంది.