‘మోడీ’నే నమ్ముకున్న చంద్రబాబు

Update: 2018-06-05 06:04 GMT

అదేంటి?. రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేస్తుంటే ...ఆయన్ను నమ్ముకోవటం ఏంటి అంటారా?. తాను చేసింది చెప్పుకుంటే ఏపీ ప్రజలు ఓట్లేస్తారనే నమ్మకం చంద్రబాబుకు ఉన్నట్లు లేదు. దీనికి తోడు చంద్రబాబు అండ్ కో చేసిన స్కామ్ లు ఇప్పటికే ప్రజల్లోకి బాగా వెళ్లాయి. అటు జనసేన, ఇటు వైసీపీ, ఇప్పుడు సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ కూడా ఏపీలో అవినీతిపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం తనకు తానే ‘క్లీన్’ సర్టిఫికెట్లు ఇఛ్చేసుకుంటున్నారు. కానీ వాస్తవ చిత్రం వేరు. అందుకే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తాను గెలుపు తీరాలను చేరుకోవాలంటే ‘మోడీ’ని నమ్ముకోవటం తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే ఏపీలో అసలు పెద్దగా ఉనికే లేని బిజెపిని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్డార్ అని హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా పోటీచేస్తే బిజెపికి ఏపీలో అసలు సీట్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి. మరి అలాంటిది మోడీతో ఢీకొట్టడటం ఏమిటి?. పోనీ చంద్రబాబు ఏమైనా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారా?. అంటే అదీ లేదే. మరోసారి ఏపీ ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే మోడీతో ఢీ అవసరం ఏముంది?. అసలు ఏపీలో బిజెపికి ఎంత సీన్ ఉంది?. చంద్రబాబు బిజెపితో సంబంధాలు తెగతెంపులు చేసుకోకముందే ఏపీ ప్రజలు బిజెపిపై, మోడీపై కసి పెంచుకున్నారు. ఆలశ్యంగా మేల్కొంది చంద్రబాబు తప్ప..ప్రజలు కాదు.

ఏపీ ప్రజలు అమరావతికి వచ్చిన ప్రదాని మోడీ మట్టి, నీళ్లు తెచ్చినప్పుడే క్లారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు చంద్రబాబు మోడీని, బిజెపిని నమ్ముకున్నారు. అందుకే ఇఫ్పుడు ఆయన తన గెలుపునకు మోడీని ఎంచుకున్నారు. తనను తిట్టే ఎవరైనా సరే మోడీతో మిలాఖత్ అయినట్లు ప్రచారం చేసే ప్లాన్ చాలా రోజుల నుంచే అమలు చేస్తున్నారు. అలా చేయటం ద్వారా అంతా మోడీతో కుమ్మక్కు అయ్యారని చెప్పటం ద్వారా పవన్ కళ్యాణ్, జగన్ పై వ్యతిరేకత పెంచి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలనే వ్యూహాంలో చంద్రబాబు ఉన్నారు. చూస్తుంటే వాళ్ళ పార్టీలతో పొత్తు కూడా చంద్రబాబే కుదిర్చేలా ఉన్నారు. అందుకే ఆయన తన నలభై ఏళ్ళ అనుభవంతో చేసిన పనులు చెప్పుకోలేక ‘మోడీ’ని నమ్ముకుని ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్లాన్ వేసుకున్నారు. గత ఎన్నికల్లో విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ తన గెలుపునకు బాటలు వేస్తారని చంద్రబాబు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన కేవలం మోడీ తప్ప ఎవరూ తన ప్రత్యర్థి కాదనే అంశాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రచారాన్ని ఏ మేరకు నమ్ముతారో వేచిచూడాల్సిందే.

 

Similar News