ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను అడిగిన ప్రశ్న. విజయనగరం జిల్లాలో నిర్వహించిన నవదీర్మాణదీక్ష సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు చెడు సావాసాలు లేవు. తాగుడు అలవాటు ఉందా? నేను అమ్మాయిలతో తిరిగానని విన్నారా?.’ అంటూ ప్రశ్నించారు. నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా..ఓ పద్దతిగా..నిబద్ధతతో పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. కానీ కొంత మంది నాయకులు ఇష్టానుసారం తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బంగాళాఖాతంలో విసిరేయాలని..ఏది పడితే అది మాట్లాడుతున్నారని జగన్ పై విమర్శలు గుప్పించారు.
రాజీనామాల పేరుతో వైసీపీ డ్రామాలాడుతోందని అన్నారు. బిజెపిని వ్యతిరేకించటంతో పవన్ కళ్యాణ్ తనను విమర్శిస్తున్నాడని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఆర్ బిఐ సహకరించకపోయినా రైతు రుణ మాఫీ చేశామని చంద్రబాబు తెలిపారు. కేంద్రంతో రాజీలేదని..ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మపోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదన్నారు.