ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి బంపర్ ఆఫర్. ఏపీలో ప్రస్తుతం అసలు సమస్యలే ఏమీ లేవా?. ఇప్పటికే రాష్ట్రం అంతా సింగపూర్ గా మారిపోయిందా?. విజయవాడ నుంచి సింగపూర్ కు విమానాలు నడపటం అంత అవ్యవసర డిమాండా?. చంద్రబాబుకు ఇదే ప్రాధాన్యతా?. ఓ వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవన్నీ వదిలేసి..సింగపూర్ కు విమానాలు నడపండి..కావాలంటే నష్టాలు వస్తే మేం చూసుకుంటాం అంటూ ఏపీ సర్కారు ఏకంగా ప్రకటన జారీ చేయటం చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. చంద్రబాబు విజయవాడకు సింగపూర్ విమానాలు వేయించక ముందు ఎవరూ అక్కడికి సింగపూర్ వెళ్ళలేదా?.ఇక వేరే మార్గం లేదా?. కొత్త రాష్ట్రంగా అవతరించిన ఏపీకి విమాన కనెక్టివిటి..అంతర్జాతీయ కనెక్టివిటి రావాటాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఏపీలో పలు సమస్యలు ఉంటే..అవన్నీ వదిలేసి సింగపూర్ కు విమానాలు నడిపే సంస్థలకు సర్కారు ముందుకొచ్చి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ఇవ్వటానికి సర్కారు ముందుకురావటమే సమస్య. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన (ఆర్ఎఫ్ పీ) నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ-సింగపూర్-విజయవాడల మధ్య వారంలో రెండు సార్లు విమానాలు నడపాలంట. ఈ విమానాల నిర్వహణలో నష్టం వస్తే దాన్ని వీజీఎఫ్ ద్వారా సర్దుబాటు చేస్తారంట.
ఆసక్తి ఉన్న సంస్థలు జూన్ 22 నాటికి తమ ప్రతిపాదనలు అందజేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) కోరింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఏదైనా ఎయిర్ లైన్స్ విజయవాడ నుంచి సింగపూర్ కు విమానాలు నడపటానికి ముందుకొచ్చిందని అనుకుందాం. వంద సీట్లు ఉన్న విమానం రాకపోకలకు ఓ పది లక్షల రూపాయలు ఖర్చు అయితే...టిక్కెట్ల బుకింగ్ ద్వారా కేవలం ఐదు లక్షల రూపాయలు వస్తే ..ఆ ట్రిప్ కు మరో ఐదు లక్షల రూపాయలు ఏపీ సర్కారు భరించాలన్న మాట. అదే సర్దుబాటు నిధి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తాజాగా అమరావతి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నెల రోజుల్లో సింగపూర్ కు విమానాలు నడపటానికి ఆయన అంగీకరిచారని ప్రకటించారు.
ఇప్పుడేమో సర్వీసులు నడిపే సంస్థలకు వీజీఎఫ్ కింద నిధులు ఇస్తామని చెబుతున్నారు. అసలు విజయవాడ-సింగపూర్ ల మధ్య విమాన సర్వీసులు నడపాలంటే రెండు దేశాల మధ్య ‘సీట్ల’కు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందం జరగాల్సి ఉంటుంది. అంతే కానీ చంద్రబాబు అడిగిన వెంటనే వచ్చి సింగపూర్ కో..లేక దుబాయ్ కో సర్వీసులు నడపటం సాధ్యంకాదని ఓ అధికారి తెలిపారు. అదే సమయంలో విమానాల్లో ఉపయోగించే ఇంధనం ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) పై ఏపీ సర్కారు పన్నును ఒక శాతానికి తగ్గింది. ఒక రకంగా ఏపీ నుంచి విమాన సర్వీసులు నడిపే సంస్థలకు ఇదే చాలా మంది ఆఫర్. అది చాలదన్నట్లు..ఏపీలో అసలు సమస్యలే ఏమీ లేవన్నట్లు చంద్రబాబు విమాన సంస్థల నష్టాలు ప్రభుత్వం భరిస్తుందని చెప్పటం విశేషం.
.