జీఎంఆర్ అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎక్కడ లేని ప్రేమ ఎందుకో?. ఈ మధ్యే భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు జీఎంఆర్ కు కాకుండా..కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి దక్కటంతో ఏకంగా టెండర్ ను రద్దు చేసి పడేశారు చంద్రబాబు. అధికారులు వద్దంటున్నా కేబినెట్ లో పెట్టి మరీ నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన స్టైల్. ఇప్పుడు అలాంటిదే మరో నిర్ణయం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కెఎస్ఈజెడ్) సొంత అవసరాల (క్యాప్టివ్) కోసం ఓ మైనర్ పోర్టును మంజూరు చేశారు. ఈ సెజ్ లో జరిగే లావాదేవీలకు మాత్రమే దీన్ని వాడుకోవాలనే నిబంధన పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. తనకు ఇష్టమైన..అక్రమాలకు అనువైన ‘స్విస్ ఛాలెంజ్’ మోడల్ ను తెరపైకి తెచ్చి ఆ పోర్టును క్యాప్టివ్ నుంచి వాణిజ్య పోర్టుగా మార్చారు. అంతే కాదు..దాన్ని జీఎంఆర్ గ్రూపు పరిధిలోనే ఉన్న కెఎస్ ఈజెడ్ కే అప్పగించేశారు. అంటే వైఎస్ హయాంలో కేవలం సెజ్ సొంత అవసరాలకే కేటాయించిన ఓడరేవును ..ఇఫ్పుడు పూర్తి వ్యాపార పోర్టుకు మార్చేశారు అన్న మాట.
ఇది ఖచ్చితంగా జీఎంఆర్ కు లాభదాయకమైన..గిట్టుబాటు కలిగే అంశం. కెఎస్ఈజెడ్ కోసం వేల ఎకరాల భూములు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకూ అక్కడ పరిశ్రమలు ఏమీ ఏర్పాటు కాలేదు. కానీ ఈ విషయంపై ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టని చంద్రబాబునాయుడు మాత్రం కెఎస్ఈజెడ్ కు అంటే జీఎంఆర్ కు అనుకూలంగా స్విస్ ఛాలెంజ్ విధానంలో ఓడరేవు ప్రాజెక్టును అప్పగించేశారు. జీఎంఆర్ గ్రూపు ప్రస్తుతం భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయి ఉంది. సొంతంగా ఓడరేవును అభివృద్ధి చేసే పరిస్థితి కూడా సంస్థకు లేదని..త్వరలోనే ఈ ఓడరేవులో వాటాలను విక్రయించేసి సంస్థ ఆర్థిక ప్రయోజనం పొందనుంది. అంటే అందులో ఎంతో కొంత ప్రభుత్వ పెద్దలకు కూడా చేరటం ఖాయం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. స్విస్ ఛాలెంజ్ విధానంలో అన్ని సంస్థల కంటే జీఎంఆర్ కు చెందిన కెఎస్ఈజెడ్ ఎక్కువ మొత్తం ఆదాయం ఇవ్వటానికి అంగీకరించినందున ఈ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోన గ్రామం వద్ద వాణిజ్య ఓడరేవు అభివృద్ధికి అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.