టీడీపీ విప్ కూడా కౌగిలించుకున్నారు మరి

Update: 2018-06-15 11:00 GMT

తెలుగుదేశం పార్టీపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీలో ఒక్క బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణనే కాదు..టీడీపీ విప్ కూన రవికుమార్ ను కూడా ఆప్యాయంగా కౌగిలించుకున్నా..ఆయన స్నేహితుడు. అంత మాత్రాన రవి వైసీపీలోకి వస్తున్నారని చెబుతారా?. మరి ఆ విజువల్స్ ఛానల్స్ చూపించలేదే?. అని పీఏసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ నేతలతో తాను రహస్యంగా సమావేశమైనట్టు వస్తున్న వార్తలు అబద్ధమని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అనైతిక రాజకీయాలు, జర్నలిజంలో తెలుగజాతి పరువు తీస్తున్నారు. వ్యక్తిగత పనుల మీద నేను ఢిల్లీ వెళ్లాను. ఏపీ భవన్‌లో అన్నీ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆకుల సత్యనారాయణతో కలిసి భోజనం చేస్తేనే ఇంత ఉలిక్కి పడతారా? మేము నిజంగా కలిస్తే ఏమైపోతారు? అతిథి గృహం లాబీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మధ్య మర్యాదపూర్వక సన్నివేశం చుట్టూ ఓ కథ అల్లడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనం. మా పార్టీ నేతలు ఎవరిని కలిసినా టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏం జరిగిందని ఇంతలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

‘అచ్చెన్నాయుడు మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు మెదడు లేదని మరోసారి నిరూపించుకున్నారు. మరోవైపు మంత్రి లోకేశ్‌ చాలా అమాయకులుగా ఉన్నారు. ఆయన ట్వీట్లు చూస్తే.. తనకున్న ‘పప్పు’ బిరుదును పోగొట్టుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లే ఆటలో దిగినట్టు ఉంది. ఒక పార్టీ నేతను.. మరో పార్టీ నేత కలవకూడదని ఎక్కడైనా చట్టముందా? రాజ్యాంగం గురించి మీరు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. టీడీపీ నాయకులు మానసిక స్థితి ఉన్మాదానికి చేరిపోయింది’ అని వెల్లడించారు. చీకట్లో భేటీలు చేయటం వాళ్లకు అలవాటే. నేను ఏమైనా కాగితాలు ఇవ్వాల్సి వస్తే ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా?. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో ఎక్కడైనా ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు.

Similar News