అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో సభ్యుడుగా ఉన్న ఒకరు వేల కోట్ల రూపాయల చర్చి ఆస్తులపై కన్నేశారు. ఈ వేల కోట్ల రూపాయల ఆస్తులను దక్కించుకునేందుకు ఆయన గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వ పెద్దలతోపాటు..కొంత మంది ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. తాజా పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో అన్న అంశంపై అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చర్చిలకు సంబంధించి కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ ద నార్తర్న్ సర్కార్స్ (సీబీసీఎన్ సీ) పేరుతో ఏపీలో కాకినాడతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ మధ్యే టీటీడీ బోర్డులో చోటు దక్కించుకున్న ఓ నేత ఈ సీబీసీఎన్ సీ పేరుతో ఉన్న ఆస్తులను తమ చేతికి దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వ్యవహారం ప్రభుత్వంలో పెద్ద దుమారం రేపుతోంది. టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్న వ్యక్తికి చర్చి ఆస్తులతో ఏమి సంబంధం ఏమిటి అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సీబీసీఎన్ సీని 1860కి చెందిన రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ చట్టంలోని సెక్షన్ 3 కింద నమోదు చేశారు. ఈ సీబీసీఎన్ సీకి చెందిన ఆస్తులకు సంబంధించి కూడా కోర్టులో కూడా కేసులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. అయినా సరే టీటీడీ బోర్డు సభ్యుడు ఈ ఆస్తులను ఎలా దక్కించుకోవాలా? అనే అంశంపై ‘స్కెచ్’ వేసుకుని పక్కాగా ముందుకు సాగుతున్నారు. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.