తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ‘సీబీఐ’ విచారణ వైపు దారితీస్తున్నాయా?. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం పురావస్తు శాఖ లేఖ కూడా పోటులో జరిగిన అక్రమ తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో భాగంగానే వచ్చిందనే చెబుతున్నారు. అయితే అప్పటికే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావటం, బిజెపి, టీడీపీల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరటంతో కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం అయినందున అప్పటికప్పుడు పురావస్తు శాఖ వెనక్కి తగ్గింది. తాజాగా టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చెన్నయ్ కేంద్రంగా విలేకరుల సమావేశం పెట్టి తీవ్ర ఆరోపణలు చేయటం, దీక్షితులవి అన్నీ తప్పుడు ఆరోపణలే అని టీటీడీ ఈవో సింఘాల్ వివరణలు ఇవ్వటం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణియన్ స్వామి రంగంలోకి దిగారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశం కన్పిస్తోంది. రమణ దీక్షితులు తొలగింపులో టీటీడీ చేసిన అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు డిమాండ్ చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
టీటీడీలో పలు విలువైన ఆభరాణాలు, వజ్రం కనిపించడం లేదని, వంటశాలలో నిబంధనలకు విరుద్ధంగా రెండు వారాలపాటు తవ్వకాలు జరిపారని, స్వామివారి కైంకర్యాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పరిధికి మించి జోక్యం చేసుకుంటోందని రమణదీక్షితులు పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే టీటీడీ 65 ఏళ్ల నిబంధన తీసుకువచ్చి రమణ దీక్షితులును తొలగించింది. తాజాగా రమణదీక్షితులు కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలను కలసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి తాజా ఫోటోలా..లేక పాతవా అన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఈ ఫోటోలను టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.