సిద్ధరామయ్య సంచలన ప్రకటన

Update: 2018-05-13 11:50 GMT

కర్ణాటక రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరివారు ఎలాగైనా అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటివరకూ అధికారంలోకి తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేసిన సిద్ధరామయ్య ఆదివారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే దళితుడికి సీఎం పదవి అప్పగిస్తామని ప్రకటించి కలకలం రేపారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ క్లారిటీ లేకపోవటంతో ఎవరికి వారు ముందస్తు ఏర్పాట్లలో ఉన్నారు. ముఖ్యంగా కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉన్న జెడీఎస్ తో చర్చలు జరిపేందుకు బిజెపి, కాంగ్రెస్ లు సన్నాహాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జెడీఎస్ అధినేత కుమారస్వామి సింగపూర్ వెళ్ళారు. కీలక చర్చలు సాగించేందుకే ఆయన అక్కడకు వెళ్లారని జెడీఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఉత్కంఠ 15వ తేదీ వరకూ కొనసాగనుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ఎవరికీ మెజారిటీ రాకపోతే 15 తర్వాత కూడా సస్పెన్స్ సాగే అవకాశం ఉంది. ఒకవేళ హంగ్‌ వస్తే.. జేడీఎస్‌ మద్దతు కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచి వ్యూహం సిద్ధం చేస్తోంది. జేడీఎస్‌ను తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారని భావిస్తున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తాము గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకునేది అధిష్టానమేనంటూ ట్విస్టు ఇచ్చారు. అయితే, గెలిచిన ఎమ్మెల్యేల మాట వినాలని, వారి అభీష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మెలిక పెట్టారు. జేడీఎస్‌ మద్దతు కోసమే సిద్ధరామయ్య దళిత సీఎం ప్రకటన చేసినట్టు భావిస్తున్నారు. తమ డిమాండ్లకు మద్దతు ఇఛ్చిన పార్టీకే మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో జెడీఎస్ ఉంది. అయితే బిజెపితో జెడీఎస్ కలసి సాగటం పక్కా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.. అయితే 15న సస్పెన్స్ కు తెరపడుతుందా? లేక మరికొంత కాలం సాగుతుందా? లేదా వేచిచూడాల్సిందే.

 

Similar News