ప్రభుత్వం వేసిన రోడ్లపై ప్రతిపక్షాలు పాదయాత్రలు చేస్తున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ‘లోకేష్..మీ ఇంట్లో డబ్బులతో రోడ్లు వేయటం లేదు. గుర్తుపెట్టుకో. మీ తాత ఆస్తులో..మీ ఇంట్లో డబ్బులో..జేబులో డబ్బులతో రోడ్లు వేయటం లేదంటూ ’వ్యాఖ్యానించారు. మా శ్రమశక్తితో ప్రజలు కట్టిన పన్నులతో వేసిన రోడ్లే ఇవి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు రిటైర్మెంట్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. బిజెపి నేతలను అంబారీలు ఎక్కించి తిప్పింది తెలుగుదేశం నేతలే అన్నారు. సన్మానాలు చేసి కేంద్రం నుంచి కాంట్రాక్ట్ లు దక్కించుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అమరావతి అభివృద్ధి పేరుతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయలతో అమరావతి అభివృద్ధి అంటారు కానీ..ఉద్దానం కిడ్నీ బాధితులకు మాత్రం 200 కోట్ల రూపాయలు కేటాయించలేరా? అని ప్రశ్నించారు.
పుష్కరాలకు రెండు వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన సర్కారు...శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయటం లేదని విమర్శించారు. పవన్ మంగళవారం నాడు శ్రీకాకుళం పట్టణంలో కవాతు నిర్వహించి..అక్కడి ఏడు రోడ్ల జంక్షన్ లో జరిగిన సభలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర నాయకులు అని చెప్పుకునే అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బొత్స సత్యానారాయణలు ఉద్ధానం సమస్యను ఇన్నేళ్ళుగా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. రెండు దశాబ్దాల్లో 40 వేల మంది చనిపోయినా నాయకుల్లో కదలిక రాదా? అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు అక్రమాలకు వేదికగా మారాయన్నారు. ఈ కమిటీ వల్ల ఎన్నికైన సర్పంచ్ లు కూడా ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు.