జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి ఆడిస్తున్నట్లుగా ఆడుతున్నారు. ఇది గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనిపై పవన్ ఇప్పటివరకూ నేరుగా స్పందించలేదు. అయితే ఏపీ ప్రభుత్వంలో అవినీతిని పవన్ ప్రశ్నించటంతోనే టీడీపీ ఈ ఎటాక్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం తమ పార్టీకి దేవ్ అనే వ్యక్తి రాజకీయ వ్యూహకర్తగా ఉంటారని ప్రకటించారు. ఆయనతో కలసి పార్టీ శ్రేణులతో ముచ్చటించారు కూడా. అయితే ఈ దేవ్ గతంలో కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరి బిజెపి నేత జనసేనకు రాజకీయ సలహాదారుగా ఎలా వ్యవహరిస్తారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం విడుదల చేసిన ఫోటోలు ఖచ్చితంగా జనసేనను ఇరకాటంలో పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ వ్యవహారం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు నమ్మే అవకాశం కూడా లేకపోలేదు. జనసేన రాజకీయాల్లో ఉన్న వారంతా నివ్వెరపోయేలా చంద్రబాబు ఎన్ని పొరపాట్లు చేసినా..స్కామ్ లు వెలుగులోకి వచ్చినా ఒక్క విమర్శ కూడా చేయకుండా ఉంది దాదాపు నాలుగేళ్ల పాటు. కానీ సడన్ గా చంద్రబాబు, నారా లోకేష్ పై దాడి ప్రారంభించారు. దీంతో టీడీపీ కూడా అదే స్థాయిలో పవన్ పై ఎటాక్ ప్రారంభించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన దేవ్ అంశం కూడా టీడీపీకి ఓ అస్త్రంగా మారనుంది.