ఓటమి కూడా చంద్రబాబుకు పండగేనా!

Update: 2018-05-31 03:58 GMT

ఓటమిని ఎవరైనా ఉత్సవంగా చేస్తారా?. అదీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి. సహజంగా అయితే ఎవరూ చేయరు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఓటమిని కూడా ఓ పండగలా చేస్తున్నారు. ఇదేమి విచిత్రమో అర్థం కావటంలేదని ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఉత్సవాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే అదీ ఉండదని చెబుతున్నారు. కానీ చంద్రబాబు ఇలాంటి ఈవెంట్ల కోసం కోట్లకు కోట్ల ప్రజాధనం మాత్రం వృధా చేస్తున్నారని ప్రభుత్వంలోని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2ను ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటారు. అది ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కానీ ఏపీ ప్రజలు...అక్కడి పార్టీలు ఉమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయి. అయినా జరిగిపోయింది.

కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నోటిఫై చేసింది జూన్ 2, 2014. అందుకే తెలంగాణలో అదే రోజు రాష్ట్రావతరణ వేడుకలు చేసుకుంటారు. ఏపీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 1నే చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో కూడా ఒరిజినల్ ప్రాంతాలు అంటే విడిపోయినవి కాకుండా మిగిలిన ఉన్న ప్రాంతం పాత తేదీల ప్రకారమే ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునేవని కూడా కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఈ సూచనను విస్మరించిన చంద్రబాబు మాత్రం ప్రతి ఏటా రాష్ట్రం విడిపోయిన జూన్2 నుంచి తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8 వరకూ వివిధ కార్యక్రమాలతో హంగామా చేస్తున్నారు. జూన్ 8న మాత్రం నవ నిర్మాణ దీక్ష చేస్తారు. దీనికి ప్రజలను బలవంతంగాతరలించటం...ప్రజలందరూ ఈ దీక్షల నుంచి మధ్యలోనే పారిపోవటం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నదే.

ఇప్పుడు కూడా కొత్తగా ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఏకంగా 13.10 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఓ వైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూ.. ప్రజల నుంచి రాజధానికి విరాళాలు సేకరిస్తూ ఇంతగా ప్రజాధనాన్ని దుబారా చేయాల్సిన అవసరం ఉందా? అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఒక్క రోజుతో ఉత్సవాలు ముగిస్తుంటే...విభజనకు గురైన ఏపీ మాత్రం వారం రోజులు ఉత్సవాలు చేసుకోవటంలో ఏమైనా అర్థం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. 2050కి విజన్ ఖరారు చేసుకునే చంద్రబాబు..ఏపీ రాష్ట్ర జంతువు, వృక్షాల ఖరారుకు మాత్రం నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. రాష్ట్ర వృక్షంగా వేప చెట్టుకు, జంతువుగా కృష్ణ జింకను ప్రకటించారు. రాష్ట్ర పుష్పంగా మల్లెపూవు, రాష్ట్రపక్షిగా రామచిలుకను ప్రకటిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బహుశా దేశంలో రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాన్ని జరుపుకోని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనేమో!.

 

 

Similar News