ఐటి సలహాదారు జె ఏ చౌదరి ఇప్పటివరకూ ఏపీకి ఎన్ని ఐటి కంపెనీలు తెచ్చారో తెలియదు కానీ..ఆయన చాలా బిజీగా ఉన్నట్లే కన్పిస్తున్నారు. అది ఎంతలా అంటే ఎప్పుడే రెండేళ్ళ క్రితం నాటి టీఏ బిల్లులు ఇఫ్పుడు పెట్టుకునేంత బిజీగా ఉన్నారు. ఆయన బిజీ ఓకే కానీ..ఆ స్థాయిలో ఐటి కంపెనీలు వస్తున్నట్లు ఎక్కడా కన్పించదు. జె ఏ చౌదరి 2016లో టీఏ బిల్లులు ఇప్పుడు పెడితే...పీఏవో అధికారులు కుదరదు పొమ్మన్నారు. అంతే సర్కారు మనదైతే ఏదైనా ఈజీనే కదా?. టీఏ బిల్లులు సకాలంలో అందజేయకపోయినా జాప్యానికి మినహాయింపులు ఇస్తూ..బిల్లులు చెల్లించేందుకు సర్కారు ఓకే చేసింది. ఈ మేరకు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ జీవో 45 జారీ చేశారు.
ఈ బిల్లులు 2016 ఫిబ్రవరి నుంచి ఉన్నాయి. ఐటి శాఖ సలహాదారు హోదాతో ఉన్న ఆయనకు పేషీ..సిబ్బంది పెద్ద ఎత్తునే ఉంటారు. సహజంగా టీఏ, డీఏ బిల్లుల సమర్పణ..అవి వచ్చేలా చూసేది పేషీ సిబ్బందే. కానీ ఎప్పుడో తిరిగిన వాటికి ఇప్పుడు బిల్లులు పెట్టడం..వాటికి మినహాయింపులు ఇఛ్చి మరీ సర్కారు ఆమోదించటం విశేషం. 2016 ఫిబ్రవరిలో టీఏ బిల్లు 60,875 రూపాయలు ఉంటే...2016 జూన్ లో ఏకంగా 1,64,955 రూపాయలు ఉంది. మొత్తం మీద టీఏ బిల్లు కింద 2,85,599 రూపాయలు మంజూరు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.