కాంగ్రెస్ అన్నీ తప్పులే చేసింది. మేమే అన్నీ సరిచేస్తున్నాం. ఇవీ నిత్యం అధికార తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పే మాటలు. మరి కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన పనులకు సంబంధించి కోట్ల రూపాయల అంచనాలు పెంపును అధికార పార్టీ నేతలు ఎలా చేశారు. అదీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే. అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు అప్పనంగా ఎలా కట్టబెట్టారు? పోనీ ఈ సవరింపులకు ఏమైనా శాస్త్రీయత ఉందా? అంటే అదీ లేదు. ఈ వ్యవహారంలో పెద్ద గోల్ మాల్ గా జరిగినట్లు కన్పిస్తోంది. దీని వెనక అసలు కథ ఏంటో మీరే చూడండి. 2009 లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నాబార్డు నిధులతో శాశ్వత పాఠశాల భవనాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. అందులో భాగంగా ప్యాకేజీ 1 కింద ఏపీలోని 9 ప్రాంతాల్లో భవనాల నిర్మాణాల కోసం 86.85 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. కానీ చంద్రబాబు సర్కారు కొలువుతీరిన వెంటనే..అంటే 2014 ఆగస్టు 4న ఈ హాస్టల్స్ కు సంబంధించి సవరించిన అంచనాల మొత్తాన్ని 102.22 కోట్ల రూపాయలకు పెంచారు. అంటే నికరంగా తొమ్మిది నిర్మాణాలకు సంబంధించి 15.37 కోట్ల రూపాయల మేర అదనపు చెల్లింపులు చేశారు. ఈ హాస్టల్స్ అన్నింటిది ఒకే మోడల్. ఒక్కో శాశ్వత పాఠశాల కాంప్లెక్స్ నిర్మాణానికి 9.65 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పోనీ ఏదైనా కారణంతో వ్యయం పెరిగితే అన్నింటికి పెరగాలి కదా?. కానీ ఒక్కో చోట ఒక్కో రకంగా రేటు పెరిగింది.
అంటే కాంట్రాక్టర్లు ‘ముడుపులు’ ఇవ్వటానికి అంగీకరించిన చోట..అంగీకరించినట్లు ఈ అంచనాలు పెంచారా?. కానీ అదేమి విచిత్రమో ఈ తొమ్మిది స్కూళ్ళు అన్నీ ఒకే ప్యాకేజీ కింద చేసినా...ప్రతి చోటా అదనపు చెల్లింపులు చేశారు కానీ ఒక్క విశాఖపట్నంలోని నర్సీపట్నంలో మాత్రం రూపాయి అంచనా వ్యయం పెరగలేదు. అదెలా సాధ్యం అవుతుంది. నర్సీపట్నంలో పెరగని వ్యయం విశాఖపట్నంలోని శ్రీకృష్ణాపురంలో మాత్రం 63 లక్షలు పెరిగింది. కానీ ఇదే భవనం విషయంలో విజయనగరం జిల్లాలోని పార్వతిపురంలో మాత్రం ఏకంగా అంచనా వ్యయం 2.56 కోట్ల రూపాయలు పెంచేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ స్కూల్ వ్యయం 1.10 కోట్లు పెంచారు. తూర్పు గోదావరి జగ్గన్నికపూర్ లో మాత్రం అంచనా వ్యయం 1.47 కోట్లు, అల్లవరంలో 2.39 కోట్ల రూపాయలు, రాజోలులో ఏకంగా 2.44 కోట్ల రూపాయలు పెంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో 2.56 కోట్ల రూపాయలు పెంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ హాస్టల్ కుసంబంధించి 2.17 కోట్ల రూపాయల మేర అంచనాలు పెంచేశారు. ఈ అంచనాల పెంపు వల్ల లాభపడిందని టీడీపీతో అత్యంత సన్నిహితంగా ఉండే బెంగుళూరుకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ గా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ప్రస్తుతం అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు కూడా అప్పగించారు. దీంతో పాటు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సన్నిహితుడి ఆశీస్సులు ఉన్న మరో కంపెనీతో పాటు ఇతర సంస్థలు ఈ ‘అదనపు చెల్లింపుల్లో’ లాభపడిన వాటిలో ఉన్నాయి.గతంలో ఈ స్కామ్ పెద్ద దుమారమే సృష్టించింది. ఇందులో ఎలుగుబంటి సూర్యనారాయణ పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.