పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత కూడా సభలో ఎంపీలు నిరసన వ్యక్తం చేయటం గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. వాయిదా పడిన సభ్యులందరూ బయటికి పోయి రకరకాల మార్గాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తుంటారు. కానీ తెలుగుదేశం ఎంపీలు ముఖ్యంగా రాజ్యసభలో వినూత్న నిరసన ప్రారంభించారు. అదేంటి అంటే సభ వాయిదా పడిన తర్వాత కూడా సభలో కూర్చుని నినాదాలు ఇవ్వటం. సభ జరుగుతున్నప్పుడే వీరు మాట్లాడే మాటలు ఏవీ రికార్డుల్లోకి ఎక్కవని ఛైర్మన్ ప్రకటిస్తుంటారు. మరి వాయిదా పడిన తర్వాత లోపల ధర్నా చేస్తే ఏమి వస్తుంది అంటారా?. అటెన్షన్. మీడియా అటెన్షన్. గతంలో ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు ఇదే మోడల్ ఫాలో అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో అసెంబ్లీ ఉండగా అదే పనిచేశారు. సభలో ఉండటమే కాదు...బయటకు తీసుకువస్తే అసెంబ్లీ లాబీల్లోనే పడుకుని నిద్రపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
తర్వాత మార్షల్స్ అందరినీ తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులో దించేసి వచ్చేవారు. ఆ స్కీమ్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. రాజ్యసభ వాయిదా పడినా టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని విభజన హామీలు నెరవేర్చాలని ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. వారిని బయటకు పంపేందుకు మార్షల్స్ విఫలయత్నం చేశారు. దాంతో టీడీపీ ఎంపీలు మార్షల్స్ తో బాహాబాహీకి దిగారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి నినాదాలు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అవిశ్వాసంపై చర్చ రాకుండానే లోక్‌సభ వాయిదాలు పడుతూ వచ్చింది. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, చర్చ జరగకపోవచ్చునని తెలియవచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేయడంతో సభను వాయిదా వేశారు. వాయిదా పడినా టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతూనే ఉంది.