నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం. పదమూడు సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. పదేళ్లు ప్రతిపక్ష నేత. ప్రధాని నరేంద్ర మోడీని ‘అర్థం’ చేసుకోవటానికి చంద్రబాబుకు ఏకంగా నాలుగేళ్ళు పట్టింది. నాలుగేళ్ళ క్రితం పుట్టిన జనసేన. అలాంటి పవన్ కళ్యాణ్ కూ చంద్రబాబు అసలు రంగు తెలుసుకోవటానికి నాలుగేళ్లు పట్టింది. ఎన్నికల సమయంలో అయితే మోడీ..బాబు జోడీ దేశాన్ని..రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. కేంద్రంలో మోడీ...రాష్ట్రంలో తాను అసలు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని ప్రజలను నమ్మించారు. కానీ సడన్ గా చంద్రబాబు తామిద్దరి జోడీ సరిగాలేదని...ఇప్పుడు కొత్త జోడీని తానే సెలక్ట్ చేస్తానని...అది ఓకే అయితే అంతా తాను చెప్పినట్లే వింటుందని చెబుతున్నారు. అందుకు ఆయనకు బహుమానం ఓ 25 ఎంపీ సీట్లు ఇస్తే చాలంటున్నారు. సహజంగా కొత్తగా పెళ్లి అయిన వారి విషయంలో కూడా అది సజావుగా సాగే సంసారమా? లేక అల్లకల్లోలం చూడాల్సి ఉంటుందా? అన్నది ఏడాదికే ఓ క్లారిటీ వస్తుంది. కానీ చంద్రబాబులాంటి సీనియర్ కు మాత్రం నాలుగేళ్లు పట్టాక కానీ అసలు అర్థం కాలేదట. ఇక జనసేన అధినేతత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అసలు ఆయన పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే.. ఆయన్ను పొగడటం కోసమేనా? అన్నట్టు ఉండేది ఆయన తీరు తొలుత. ఎవరైనా పక్కోళ్ల కోసం పార్టీ పెడతారా? అనే విమర్శలు కూడా ఎదుర్కోన్నారు.
ఇక పవన్ విషయంలో టీడీపీ కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు. అసలు ప్రతిపక్ష నేత అంటే పవన్ లా ఉండాలని ‘సర్టిఫికెట్లు’ ఉదారంగా ఇచ్చేశారు. జగన్ లాంటి వ్యక్తులు పవన్ ను చూసి ఎలా నిర్మాణాత్మక సలహాలు..సూచనలు ఇవ్వొచ్చో నేర్చుకోవాలని మంత్రులు సందేశాలు ఇచ్చారు. అందుకే పవన్ లేవనెత్తిన సమస్యలు అన్నింటిని తాము పరిష్కరిస్తున్నట్లు మంత్రులు చెప్పారు అప్పట్లో. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు..లోకేష్ లపై పవన్ ఎటాక్ మొదలుపెట్టారు. అంతే టీడీపీ నేతలు కూడా అసలు పవన్ కు రాజకీయం తెలుసా?. ఆయన ఎవరి చేతిలోనే బందీ అయిపోయారు. ఎవరో ఆడిస్తే ఆడుతున్నారు అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంటే అంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నంత సమయం తీసుకుని సభ్య సమాజానికి ఏం సందేశం ఇచ్చారు?.