నారా లోకేష్. అచ్చం తండ్రి చంద్రబాబు బాటలోనే. ఇప్పుడు కొత్తగా మరో దత్తత డ్రామాకు శ్రీకారం చుట్టారు. జన్మభూమి కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టి.. ఆ పేరు చెప్పుకుని విశేష ప్రచారం పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తన పుట్టిన ఊరు నారావారి పల్లెను సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దలేకపోయారు. అందుకే ఇప్పుడు ఆ గ్రామాన్ని నారా బ్రాహ్మణి దత్తత తీసుకోవాల్సి వచ్చింది. అంతే కాదు..చంద్రబాబు ముఖ్యమంత్రి కావటానికి కారణం అయిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం అయిన నిమ్మకూరుదీ అదే పరిస్థితి. దాదాపు పదేళ్ల పాటు సీఎంగా..మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి రెండు ఊళ్ళను కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటంలో చంద్రబాబు విఫలమయ్యారు. అందుకే నిమ్మకూరు ను ఇప్పుడు నారా లోకేష్ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్నట్లు ఘనంగా ప్రకటించుకున్న మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ డబ్బుతో ఆ గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ప్రభుత్వ డబ్బుతో చేస్తే అది దత్తత ఎలా అవుతుంది?. అందులో లోకేష్ గొప్పతనం ఏముంటుంది?. విరాళాల రూపంలోనే..లేదంటే సీఎస్ఆర్ నిధులు తెచ్చి అబివృద్ధి చేయాలి కానీ...సర్కారు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తే అది దత్తత అవుతుందా?. నిమ్మకూరు విషయంలో లోకేష్ దత్తత అర్థం మార్చేశారు. ఓ రెండు గ్రామాలను కూడా పూర్తిగా ఆదర్శగ్రామాలుగా మార్చలేని దేశంలో సీనియర్ నేత చంద్రబాబు...ఆదర్శ నాయకుడు నారా లోకేష్ లు. ఇప్పుడు నారా లోకేష్ కొత్తగా ఏకంగా శ్రీకాకుళం జిల్లాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అది ఎంత బాగా చేస్తారో వేచిచూడాల్సిందే. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ ఈ దత్తత ప్రకటన చేశారు.