మోడీతోపాటు...చంద్రబాబు వీడియోలేస్తే అదిరిపోదా!

Update: 2018-04-30 04:57 GMT

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కొత్త డ్రామాకు తెరతీశారు. అదే ‘ధర్మ పోరాట‘ సభ అట. అందులో నరేంద్రమోడీ తిరుపతి సభ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రదర్శిస్తారట. ఓకే. అందులో తప్పు పట్టాల్సింది ఏమీలేదు. మోడీ హామీ ఇచ్చారు. అమలు చేయలేదు. అదే సమయంలో మోడీతోపాటు..చంద్రబాబు వీడియోలు కూడా ప్రదర్శిస్తే వ్యవహారం అదిరిపోతుంది కదా?. దేశంలోనే పారదర్శకతకు..నీతి, నిజాయతీలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. చంద్రబాబునాయుడు తన నిజాయతీ నిరూపించుకునేందుకు ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటల వీడియోలు కూడా వేస్తే ఏపీ అంతా అదిరిపోతుంది కదా?. హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నామంటే ఒప్పుకున్నామనే వాదన కూడా కొంత వరకూ ఓకే.

కానీ అసలు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుంది?. నన్ను ఎడ్యుకేట్ చేయండి. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి. అక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు మీడియా సాక్షిగా..అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వీడియోలు ఇఫ్పటీకీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుందో చెప్పండి అని విపక్షాలకు సవాల్ విసిరారు. మరి అలాంటి సవాల్ విసిరిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ కోసం ఉద్యమబాట పట్టారు. హోదాతో ఏమీరావని..పరిశ్రమలు..ఉద్యోగాలు రావని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ఎందుకు పోరాటం చేస్తున్నట్లు?. మోడీతోపాటు చంద్రబాబు వీడియోలు కూడా వేసి ప్రజలకు అన్నీ వివరిస్తే ‘ఓ క్లారిటీ వస్తుంది కదా’?.

 

 

Similar News