ఫిరాయింపుల వ్యవహారం... అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

Update: 2018-04-10 11:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హైకోర్టులో ఈ అంశంపై మంగళవారం నాడు విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇంత వరకూ నిర్ణయం తీసుకోకపోవటంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం వాదనలు వినిపించారు. నలుగురు మంత్రులు సహా మొత్తం 19మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలోనే ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేసినా.. స్పీకర్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా.. స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది సుధాకర్‌రెడ్డి వాదనలతో విన్న ధర్మాసనం​.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్‌ నిర్దిష్ట సమయంలో స్పందించాల్సి ఉందన్న వాదనతో ఏకీభవించారు.

Similar News