జెపీసికి చంద్రబాబు డిమాండ్

Update: 2018-04-04 12:12 GMT

ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్బంగా ఇచ్చిన హామీలు ఏంటి?...వాటి అమలు తీరును పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపీసీ) వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. జెపీసీ అసలు కేంద్రం ఏమి చేసింది..ఏమి చేయాల్సి ఉందో పరిశీలిస్తే సరిపోతుందని చంద్రబాబు అన్నారు. రెండు రోజుల పర్యటనలో చివరి రోజైన బుధవారం నాడు చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఏ రాష్ట్రానికి కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వనందునే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని తెలిపారు. విభజన చట్టం హామీలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ప్యాకేజీ విషయంలో కూడా కేంద్రం న్యాయం చేయలేదన్నారు. విభజన చట్టంలోని 90 శాతం హామీలను అమలు చేసినట్లు బిజెపి నేతలు చెబుతున్నారు కదా? అని ప్రశ్నించగా...రెవెన్యూ లోటు ఎంత అని చెప్పారు..ఎంత చేశారు అని ప్రశ్నించారు. నాలుగేళ్లు ఎదురుచూసినా ఏమీ చేయనందునే తాము ఎన్డీయే నుంచి..కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చామని తెలిపారు. ఏపీ పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాతోపాటు..రాజధాని గురించి చెప్పిన మాటల వీడియోలను మీడియాకు వేసి చూపించారు.

వైసీపీ మద్దతు ఉందనే కారణంతోనే ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వారం వారం కోర్టు కెళ్లే వ్యక్తులు పీఎంవోలోకి అంత ఈజీగా ఎలా యాక్సెస్ దొరుకుతోందని..దీన్ని బట్టే ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కేంద్రం చేసిన మోసాన్ని బయటపెట్టేందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని..తమ ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే సమస్యలు సృష్టించారు తప్ప..మరొకటి కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలు వదిలేసి హోదా విషయంలో టీడీపీ, వైసీపీ కలసి ఎందుకు సాగటం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..ముఖ్యమంత్రి హోదాలో తాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బిజెపితోపాటు వైసీపీ, జనసేనలు అసలు సమావేశానికే రాలేదని అన్నారు. కేంద్రం కొత్తగా ఇప్పుడు స్పెషల్ పర్సస్ వెహికల్ అంటుందని..దీని వల్ల రాష్ట్రం అప్పులు తెచ్చుకునే వెసులుబాటు తగ్గుతుందని తెలిపారు.

 

Similar News